Ad Code

ఇంట్లో భార్యతో పాటు సమానంగా పని చేయాలి : సుప్రీంకోర్టు


ఇంట్లో పనుల విషయంలో భార్య క్రూరంగా ప్రవర్తిస్తోందని ఆరోపిస్తూ ఓ భర్త విడాకులు కోరగా కింది కోర్టు మంజూరు చేసింది. అనంతరం కర్ణాటక హైకోర్టు కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వును రద్దు చేసింది. అటు తర్వాత హైకోర్టు ఉత్తర్వును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తాజాగా పిటిషన్ సుప్రీం కోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ ఇరుపక్షాల మధ్య మధ్యవర్తిత్వం విఫలమైందని తెలిపాడు. భార్యాభర్తలిద్దరూ ఉపాధ్యాయులు అని, వీరికి 2017లో వివాహం జరిగిందని, 2019 నుంచి విడిగా నివసిస్తున్నారని తెలిపాడు. భార్య క్రూరత్వం కారణంగా బాధితుడు కింది కోర్టులో విడాకులు కోరగా  కోర్టుమంజూరు చేసిందని, అనంతరం కర్ణాటక హైకోర్టు రద్దు చేయడంతో తిరిగి సుప్రీంకోర్టుకు వచ్చినట్లు పేర్కొన్నాడు. తన క్లయింట్ విడాకులు కోరుకుంటున్నాడని తెలియజేశాడు. దీంతో ధర్మాసనం భార్య క్రూరత్వం ఏమిటి? అని ప్రశ్నించింది. దీంతో ఇంటిలో పనులు చేయకుండా, వంట చేయకుండా ఇబ్బంది పెడుతోందని పిటిషనర్ తరపు న్యాయవాది పేర్కొన్నాడు. దీంతో జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం పిటిషనర్‌కు ఓ రేంజ్‌లో క్లాస్ పీకింది. ''వంట చేయడం, శుభ్రపరచడం, బట్టలు ఉతకడం భార్య ఒక్కదానికి సంబంధించింది కాదని, ప్రస్తుతం కాలం మారిందని.. అన్ని పనుల్లో భార్యతో పాటు భర్తలు కూడా పాలుపంచుకోవాల్సిందేనని, అయినా మీరు ఒక పని మనిషిని పెళ్లి చేసుకోలేదు. ఒక జీవిత భాగస్వామిని పెళ్లి చేసుకున్నారు. భార్య అనుచితంగా ప్రవర్తించిందని వంట చేయలేదని విడాకులు కోరడమేంటి?'' అని పిటిషనర్‌ను సుప్రీం కోర్టు తీవ్రంగా మందలించింది. ''భార్యాభర్తలు అన్నాక అన్ని పనుల్లో భర్తలు సహాయం చేయాలి. వంట, బట్టలు ఉతకడం ఇలా అన్ని పనుల్లో భర్త సహకరించాలి. వివాహం అనేది జీవిత భాగస్వాముల కోసం కాబట్టి ఇంటి పనుల్లో భర్త తన భార్యకు సమానంగా సహాయం చేయాల్సిందే. వంట చేయడానికి లేదా ఇంటి పనులు చేయడానికి భార్య నిరాకరించడాన్ని మానసిక క్రూరత్వానికి కారణంగా పరిగణించలేం.'' అని సుప్రీం కోర్టు పేర్కొంది. తదుపరి విచారణకు ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులిద్దరూ రావాలని న్యాయస్థానం పేర్కొంది. దీంతో తదుపరి విచారణ ఏప్రిల్ 27కు వాయిదా వేసింది.

Post a Comment

0 Comments

Close Menu