Ad Code

యూట్యూబర్ ఆకాష్ ఆత్మహత్య ? : దోచుకుని, ఆపై హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానం


ఢిల్లీలో శనివారం నుంచి కనిపించకుండా పోయిన యూట్యూబర్ ఆకాష్ సోమవారం సాయంత్రం ఆనంద్ విహార్ లోని ఖాళీ ప్రదేశంలో శవమై కనిపించాడు. ఆకాష్ మరణంపై అతని కుటుంబంలో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పోలీసుల నిర్లక్ష్యం, కాల్ వివరాలు పొందడానికి ఒక కానిస్టేబుల్ 10,000 రూపాయలు లంచం తీసుకున్నాడని కుటుంబసభ్యులు ఆరోపణలు చేశారు. తూర్పు ఢిల్లీలోని మండవాలి ప్రాంతంలో అలీఘర్‌కు చెందిన ఆకాష్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అతనికి తల్లిదండ్రులు, భార్య, మూడు సంవత్సరాల కుమార్తె ఉన్నారు. మండవలి ప్రాంతానికి చెందిన ఆకాష్ స్టైలింగ్ అనే క్లాత్ షోరూమ్‌ను నడుపుతూ సోషల్ మీడియాలో ఫ్యాషన్ వీడియోల ద్వారా ఫేమస్ అయ్యాడు. శనివారం మార్చి 7వ తేదీ మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో, ఆకాష్ రూ. 1.50 లక్షల నగదుతో గాంధీ నగర్ మార్కెట్‌కు బయలుదేరాడు. మధ్యాహ్నం 2:33 గంటలకు అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. అతని కుటుంబసభ్యులు మండవలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ కేసులో ఆసక్తి చూపలేదని ఆకాష్ సోదరుడు సత్యేంద్ర ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యులు స్వయంగా ఫోన్ చివరి లోకేషన్ గుర్తించారు. అది ఆనంద్ విహార్‌లోని టెల్కో టి-పాయింట్ సమీపంలో ఉంది. సోమవారం సాయంత్రం కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నప్పుడు, ఖాళీగా ఉన్న డిడిఎ ప్లాట్‌లో ఆకాష్ మృతదేహం పడి ఉండటం వారు కనుగొన్నారు. అతని మొబైల్ ఫోన్ కూడా కొంత దూరంలో స్విచ్ ఆఫ్ చేసి ఉంది. విగతజీవిగా పడి ఉన్న ఆకాష్ ఒంటిపై ఉండాల్సిన బంగారు గొలుసు, 1.50 లక్షల రూపాయలు కనిపించడం లేదని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఎవరో అతనికి విషం ఇచ్చి, నగదు, నగలు దోచుకుని, ఆపై హత్య చేసి ఉంటారని కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. మంగళవారం పోస్ట్‌మార్టం తర్వాత మృతదేహాన్ని అందుకున్న వారు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మండవలి పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టారు. తరువాత, పోలీసు అధికారులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. మృతదేహం పరిస్థితి ఆధారంగా, ఇది హత్య కేసుగా కనిపించడం లేదని తూర్పు ఢిల్లీ డిసిపి రాజీవ్ కుమార్ అన్నారు. ప్రస్తుతం పోలీసులు పోస్ట్‌మార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నామన్నారు. సిసిటివి ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నామని, లంచం తీసుకున్నారనే ఆరోపణలపై కూడా దర్యాప్తు చేస్తున్నామని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. నివేదిక అందిన తర్వాతే మరణానికి అసలు కారణం స్పష్టంగా తెలుస్తుందన్నారు.

Post a Comment

0 Comments

Close Menu