Ad Code

డబ్బులు ఇవ్వకపోతే శపిస్తా : వృద్ధురాలిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన స్వామీజీ


ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లా ఉయ్యూరు మండలంలోని ఆకునూరు గ్రామంలో ఆదివారం ఉదయం జరిగిన ఈ సంఘటన స్థానికులను కలవరపరిచింది. భక్తి విశ్వాసాలను ఆయుధంగా మార్చుకొని కొందరు వ్యక్తులు ఓ వృద్ధురాలిని బెదిరించి డబ్బులు వసూలు చేశారు. ఆకునూరులో నివాసం ఉంటున్న మందాడ ప్రసాదరావు, మనీ దంపతుల ఇంటికి ఉదయం సమయంలో నలుగురు వ్యక్తులు కాషాయ వస్త్రాలు ధరించి వచ్చారు. మంత్రాలు జపిస్తూ స్వామీజీలమని చెప్పుకుంటూ ఇంటిలోకి ప్రవేశించిన వారు మొదట భక్తి వాతావరణాన్ని సృష్టించారు. ఆ తర్వాత అసలు రూపం బయటపెట్టారు. నీ భర్త నాకు బాగా తెలుసు. మాకు ఆశ్రమం కూడా ఉంది. అందులో గోవుల సంరక్షణ కోసం వెంటనే లక్ష రూపాయలు ఇవ్వాలంటూ బాధితురాలని ఒత్తిడి చేయడం ప్రారంభించారు. ఆమె వద్ద అంత డబ్బు లేదని చెప్పిన ‘డబ్బు ఇవ్వకపోతే శపిస్తాం.. మీ కుటుంబానికి కష్టాలు వస్తాయి’ అంటూ బెదిరింపులకు దిగారు. ఈ ఆకస్మిక చర్యతో భయాందోళనకు గురైన బాధితురాలు చేతిలో ఉన్న కాడికి రూ.5000 వారికి ఇచ్చింది. కానీ అక్కడితో ఆగని ఆ వ్యక్తులు మరింత డబ్బు కోసం ప్రయత్నించారు. అదే సమయంలో బాధితురాలు మనీ మేనల్లుడు తోట్లవల్లూరు మండలంలోని బొడ్డపాడు నుంచి వచ్చిన వెంకట రామకృష్ణ అక్కడికి వచ్చాడు. పరిస్థితిని అర్థం చేసుకునే లోపే అతడి వద్ద నుంచి మరో వెయ్యి రూపాయలు వసూలు చేసి అక్కడి నుంచి జారుకున్నారు. ఈ సంఘటనతో షాక్‌కు గురైన బాధితురాలు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. సమాచారం అందుకున్న ఉయ్యూరు రూరల్ పోలీసులు సంఘటనపై తక్షణం స్పందించారు. బాధితురాలిని విచారించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Post a Comment

0 Comments

Close Menu