కేరళలోని కోజికోడ్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న శ్మశాన వాటికలో గ్యాస్ సిలిండర్ల నిల్వలు పూర్తిగా అయిపోవడంతో గ్యాస్ ఆధారిత దహన సంస్కారాలను తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో అంతిమయాత్రకు వచ్చిన కుటుంబాలకు కష్టాలు ఎదుర్కొంటున్నాయి. స్మృతిపథం స్మశానవాటికలో అంతిమ సంస్కారాల ఖర్చు ఇతర ప్రాంతాల కంటే తక్కువగా ఉంటుంది. గ్యాస్ ఆధారిత దహనానికి సుమారు ₹2,000, ఎలక్ట్రిక్ విధానానికి ₹2,500 వసూలు చేస్తారు. అందుకే ఆర్థికంగా బలహీన వర్గాలకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అయితే గ్యాస్ సిలిండర్ల సరఫరా కొరతతో కొందరు కుటుంబాలు తమ బంధువుల మృతదేహాలతో గంటల తరబడి ఎదురు చూసే పరిస్థితి ఎదురవుతోంది. సరఫరాదారులను పలుమార్లు సంప్రదించినా కొత్త స్టాక్ రాలేదని స్మశానవాటిక సిబ్బంది చెబుతున్నారని వాపోతున్నారు. దీంతో గ్యాస్ ఫర్నేస్‌లు పనిచేయకపోవడంతో అధికారులు వాటిని తాత్కాలికంగా మూసివేశారు. గ్యాస్ ఫర్నేస్‌లు నిలిచిపోవడంతో ప్రస్తుతం సంప్రదాయ పద్ధతులే శరణ్యంగా మారాయి. కొబ్బరి పీచు, కొబ్బరి చిప్పలు, కట్టెలు ఉపయోగిస్తూ దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియ ఎక్కువ సమయం పడుతుందని.. అయినప్పటికీ తమ బంధువులకు చివరి వీడ్కోలు ఇవ్వాలని కుటుంబాలు ఈ విధానాన్నే అంగీకరించాల్సి వస్తోంది. ఈ స్మశానవాటికలో ఎలక్ట్రిక్ క్రీమెటోరియం కూడా ఉంది. కానీ అది సాంకేతిక కారణాలతో గత నాలుగు నెలలుగా పనిచేయడం లేదు. అది పనిచేసి ఉంటే ఇప్పటి పరిస్థితి కొంతవరకు సులభమయ్యేదని స్థానికులు అంటున్నారు. అధికారులు మాత్రం వారం రోజుల్లో మరమ్మతులు పూర్తి చేస్తామని చెబుతున్నారు.
0 Comments