కేంద్ర మాజీ మంత్రి కేపీ.ఉన్నికృష్ణన్ కన్నుమూశారు. కొంత కాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కేరళ కోజికోడ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. ఉన్నికృష్ణన్ మరణం పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడైన ఉన్నికృష్ణన్ 1971 నుంచి 1996 వరకు వడకర పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ప్రాతినధ్యం వహించారు. 1989-90 మధ్య కాలంలో దివంగత మాజీ ప్రధాని వీపీ.సింగ్ హయాంలో ఉన్నికృష్ణన్ కేంద్ర మంత్రిగానూ సేవలందించారు. 1990లో గల్ఫ్ యుద్ధ సమయంలో నాటి ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌ను రహస్యంగా కలిశారు. నాడు ప్రాణాలకు తెగించి మరీ సుమారు ఒకటిన్నర లక్షల మంది భారతీయులను స్వదేశానికి చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. మంత్రివర్గ సభ్యులంతా దీనికి వ్యతిరేకంగా సలహాలు ఇచ్చినప్పటికీ సద్దాం హుస్సేన్‌తో ఆయన జరిపిన చర్చలే భారతీయులను రప్పించేందుకు దోహదపడ్డాయి.
0 Comments