Ad Code

సిద్ధూమూస్‌వాలా హత్య కేసు : నిందితులు పవన్, జగ్తార్ లకు బెయిల్ మంజూరు


పంజాబ్‌ పాప్ సింగర్, ర్యాపర్  సిద్ధూ మూస్‌వాలా హత్య కేసు నిందితులు పవన్, జగ్తార్ లకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.  2022, మే 29న సిద్ధూ మూస్‌వాలా మాన్సా జిల్లాలోని జవహర్కే గ్రామంలో పట్టపగలు హత్యకు గురయ్యాడు. సిద్ధూ తన అనుచరులతో కలిసి థార్ వాహనంలో వెళ్తుండగా, వేరే వాహనాల్లో వచ్చిన సాయుధులు అతడిపై కాల్పులు జరిపారు. దాదాపు 19 బుల్లెట్లు అతడిపై కాల్చారు. ఈ ఘటనలో సిద్ధూ అక్కడికక్కడే మరణించాడు. అతడు మరణించడనికి ముందు తన దగ్గర ఉన్న లైసెన్సుడ్ తుపాకితో వారిపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. కానీ, ఆ లోపే నిందితులు అక్కడ్నుంచి పారిపోయారు. అప్పట్లో కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం సిద్ధూకు సెక్యూరిటీని తగ్గించిన మరునాడే ఈ హత్య జరిగింది. దీంతో ఈ హత్యపై రాజకీయ దుమారం రేగింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో ఈ హత్య ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకుని విచారణ జరిపారు. హత్యతో సంబంధం ఉన్న పలువురిని అరెస్ట్ చేశారు. ఈ హత్యకు ప్రముఖ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కు, కెనడా బేస్డ్ గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌కు సంబంధం ఉన్నట్లు తేలింది. విచారణలో భాగంగా పవన్ బిష్ణోయ్, జగ్తార్ సింగ్‌ సహా పలువురిని అరెస్టు చేశారు. లారెన్స్ బిష్ణోయ్ బంధువు పవన్. పవన్, జగ్తార్ ఇద్దరూ సిద్ధూ హంతకులకు వాహనం సమకూర్చడం, ఆయుధాలు సమకూర్చడంలో సహకరించారనే అభియోగాలున్నాయి. ఈ హత్యలో వీరు కూడా కుట్రదారులే అని పోలీసులు కోర్టుకు తెలిపారు. సిద్ధూ హత్య జరిగిన కొద్ది రోజులకే వీరిని అరెస్టు చేశారు. దాదాపు మూడేళ్లుగా వీరు పోలీసు కస్టడీలోనే ఉన్నారు. తాజాగా బెయిల్ మంజూరు కావడంతో ప్రొసీడింగ్స్ పూర్తైన తర్వాత జైలు నుంచి విడుదలవుతారు.

Post a Comment

0 Comments

Close Menu