Ad Code

న్యాయవ్యవస్థలో అవినీతి పాఠం : పాఠ్యపుస్తకాన్ని పూర్తిగా ఉపసంహరించుకున్న ఎన్‌సిఇఆర్‌టి


నిమిదవ తరగతి పాఠ్య పుస్తకంలోని నాలుగవ అధ్యాయంలో ఎన్‌సిఇఆర్‌టి న్యాయవ్యవస్థలో అవినీతి, కేసుల జాప్యం వంటి అంశాలను ప్రస్తావించడంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో మండిపడింది. దీనిపై స్పందించిన ఎన్‌సిఇఆర్‌టి సదరు అధ్యాయంలోని అంశాలకు ఎటువంటి షరతులు లేకుండా బహిరంగ క్షమాపణలు కోరింది. ఈ వివాదంపై సుప్రీంకోర్టు సుమోటోగా కేసు స్వీకరించి విచారణ జరిపింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం, పాఠశాల విద్యార్థుల మనసుల్లో న్యాయవ్యవస్థ పట్ల తప్పుడు అభిప్రాయాలు కలిగించేలా ఈ పాఠ్యాంశం ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగజార్చేలా ఉందని, దీని వెనుక లోతైన కుట్ర ఉండవచ్చని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ పుస్తకం ముద్రణ, పంపిణీ , డిజిటల్ ప్రసారాలపై తక్షణమే పూర్తిస్థాయి నిషేధాన్ని విధిస్తూ, మార్కెట్లో ఉన్న అన్ని కాపీలను వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ, వివాదాస్పద పాఠ్యాంశాల తయారీలో బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ పాఠ్యాంశాన్ని రూపొందించిన నిపుణులను భవిష్యత్తులో ఎటువంటి ప్రభుత్వ కమిటీల్లోనూ చేర్చుకోబోమని సోలిసిటర్ జనరల్ కోర్టుకు హామీ ఇచ్చారు. అలాగే, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి ఈ పుస్తకాన్ని తొలగించాలని కేంద్రం ఐటీ మంత్రిత్వ శాఖను కోరింది. ప్రస్తుతం ఎన్‌సిఇఆర్‌టి ఆ పాఠ్యపుస్తకాన్ని పూర్తిగా ఉపసంహరించుకుంది. పాత కాపీలు ఎవరి దగ్గర ఉన్నా వాటిని తిరిగి ఇచ్చేయాలని, సోషల్ మీడియాలో ఆ పాఠానికి సంబంధించిన వివరాలను తొలగించాలని కోరింది. న్యాయవ్యవస్థ గౌరవాన్ని కాపాడేలా, సంబంధిత అధికారుల సంప్రదింపులతో ఈ అధ్యాయాన్ని తిరిగి రాయనున్నట్లు ఎన్‌సిఇఆర్‌టి స్పష్టం తెలిపింది.

Post a Comment

0 Comments

Close Menu