టెక్ మహీంద్రాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తారనే ప్రచారాన్ని సంస్థ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సోమవారం స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు సమర్పించిన ఫైలింగ్‌లో కంపెనీ తన స్పష్టమైన వైఖరిని వెల్లడించింది. ఇటీవల 'X' (ట్విట్టర్) వంటి ప్లాట్‌ఫామ్స్‌లో టెక్ మహీంద్రా సుమారు 30,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపనుందనే వార్త విపరీతంగా వైరల్ అయ్యింది. దీంతో అటు ఉద్యోగుల్లో, ఇటు పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. దీనిపై స్పందించిన కంపెనీ, "అలాంటి ప్రతిపాదన ఏదీ ప్రస్తుతం సంస్థ పరిశీలనలో లేదు. మార్కెట్లో వస్తున్నవన్నీ నిరాధారమైన పుకార్లే" అని స్పష్టం చేసింది. 1.5 లక్షల మంది ఉద్యోగులతో కంపెనీ స్థిరంగా ఉందని, వర్క్‌ఫోర్స్‌ను తగ్గించే ఉద్దేశం లేదని భరోసా ఇచ్చింది. ఉద్యోగాలను తీసివేయడం కంటే, ఉన్న సిబ్బందిని సమర్థవంతంగా వాడుకోవడంపైనే కంపెనీ దృష్టి సారిస్తోంది. ప్రాజెక్టులు పూర్తయిన చోట లేదా తక్కువ పని ఉన్న విభాగాల నుండి ఉద్యోగులను తొలగించకుండా, వారిని కొత్త ప్రాజెక్టులకు మరియు అవసరమైన విభాగాలకు బదిలీ చేస్తున్నట్లు తెలిపింది. దీనివల్ల ఉద్యోగ భద్రతతో పాటు కంపెనీ ఉత్పాదకత కూడా పెరుగుతుందని యాజమాన్యం భావిస్తోంది.
0 Comments