Ad Code

సౌదీపై జరిగిన దాడిలో భారతీయులు ఎవరూ చనిపోలేదు : భారత రాయబార కార్యాలయం


సౌదీ అరేబియాలోని నివాస ప్రాంతాలపై జరిగిన క్షిపణి దాడిలో ఒక భారతీయుడు చనిపోయినట్లు వచ్చిన వార్తలను అక్కడి భారత రాయబార కార్యాలయం ఖండించింది. ఈ ఘటనలో భారతీయులెవరూ ప్రాణాలు కోల్పోలేదని స్పష్టం చేసింది. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌కు సమీపంలోని అల్ ఖర్జ్ గవర్నరేట్‌పై ఆదివారం సాయంత్రం ఒక సైనిక ప్రొజెక్టైల్ వచ్చి పడింది. ఈ దాడిలో ఇద్దరు విదేశీయులు మరణించారని, వారిలో ఒకరు భారతీయుడు, మరొకరు బంగ్లాదేశీయుడు అని సౌదీ సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ ప్రాథమిక సమాచారం ఇచ్చింది. అయితే మృతుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత సౌదీ అధికారులు తమ నివేదికను సవరించారు. చనిపోయిన ఇద్దరు వ్యక్తులు కూడా బంగ్లాదేశ్‌కు చెందిన వారేనని, మృతుల్లో భారతీయులెవరూ లేరని తాజా విచారణలో తేలింది. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా ప్రకటన విడుదల చేసింది. "అల్ ఖర్జ్ దాడిలో భారతీయులెవరూ చనిపోలేదు. ఇది నిజంగా ఊరటనిచ్చే వార్త" అని ఎంబసీ పేర్కొంది. ఈ భీకర దాడిలో మొత్తం 12 మంది గాయపడగా.. వారిలో ఒక భారతీయ పౌరుడు ఉన్నట్లు ఎంబసీ ధృవీకరించింది. సదరు వ్యక్తికి ప్రస్తుతం అల్ ఖర్జ్ లోని స్థానిక ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. "మేము నిరంతరం స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాం. గాయపడిన మన దేశ పౌరుడికి మెరుగైన వైద్యం అందేలా చూస్తున్నాం" అని భారత దౌత్యవేత్తలు వెల్లడించారు.


Post a Comment

0 Comments

Close Menu