Ad Code

ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగంపై యుద్ధ ప్రభావం : అమాంతంగా పడిపోయిన ధరలు


యుద్ధ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో సాగయ్యే రొయ్యలు విదేశాలకు ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో ఏపీలోని ఆక్వా రంగం తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొంటోంది. గత సంవత్సరం అమెరికా విధించిన సుంకాల నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆక్వా రైతులకు ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య కొనసాగుతున్న యుద్ధం మరో భారీ దెబ్బగా మారింది. ఏపీలోని గోదావరి జిల్లాలలో రొయ్యల సాగు లక్షల ఎకరాలలో జరుగుతుంది. ఇక్కడ నుండి అంతర్జాతీయంగా రొయ్యల ఎగుమతులు జరుగుతాయి. పశ్చిమగోదావరి జిల్లాలో దాదాపు రెండు లక్షల ఎకరాలలో రొయ్యల సాగు జరుగుతుండగా, అంతర్జాతీయ ఎగుమతులు నిలిచిపోవడంతో ధరలు అమాంతం పడిపోయాయి. దీంతో రొయ్యలను సాగు చేస్తున్న రైతులు తీవ్ర నష్టాలను చూడాల్సి వస్తుంది. గత నాలుగైదు రోజులుగా రొయ్యల ధరలు కేజీకి 30 రూపాయల నుండి 40 రూపాయల వరకు పతనం కాగా రైతులకు ఒక్కొక్క టన్నుకు సుమారు 40 వేల రూపాయల వరకు నష్టం వాటిల్లుతోంది. ముఖ్యంగా 30 కౌంట్ రొయ్యల ధర 510 నుండి 470 లకు, 40 కౌంట్ రొయ్యల ధర 410 రూపాయల నుండి 360 రూపాయలకు పడిపోవడం రొయ్యల సాగు దారులను తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఒకవైపు మార్కెట్లో ధరలు తగ్గుతుంటే మరోవైపు సాగు ఖర్చులు విపరీతంగా పెరగడం రైతులకు ఇబ్బందికరంగా మారింది. మార్కెట్లో ఏర్పడే అనిశ్చితుల ప్రభావం కూడా ఆక్వా రంగంపై పడుతుందన్న ఆవేదన వ్యక్తం అవుతుంది.

Post a Comment

0 Comments

Close Menu