తెలంగాణలో ఆరోగ్యశ్రీ బిల్లులను గ్రీన్ ఛానల్ ద్వారా విడుదల చేస్తున్నామని ప్రభుత్వం చెప్పిందని, కానీ చెప్పిన విధంగా విడుదల కావడం లేదని ప్రశ్నించిన హరీశ్‌రావుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు. గత ప్రభుత్వం సుమారు రూ. 600 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టిందని విమర్శించారు. అందులో ప్రభుత్వ ఎయిడెడ్ ఆస్పత్రులకు రూ. 240 కోట్లు, ప్రైవేటు ఆస్పత్రులకు రూ. 360 కోట్ల బకాయిలు ఉన్నాయని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రతి నెలా సగటున రూ. 89 కోట్లు ఖర్చు చేస్తూ, మొత్తంగా రూ. 2,408 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలను క్లియర్ చేశామని అన్నారు. అందులో ప్రభుత్వ ఎయిడెడ్ ఆస్పత్రులకు రూ. 927 కోట్లు, ప్రైవేటు ఆస్పత్రులకు రూ. 1,480 కోట్లు చెల్లింపులు జరిగాయని వెల్లడించారు. ఆరోగ్యశ్రీ విషయంలో నిరుపేదలకు అన్యాయం జరుగుతోందంటూ అపోహలు కల్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఎలా దుర్వినియోగం చేశారో అందరికీ తెలుసని చురకలంటించారు. ఎవరి పీఏలు సీఎం రిలీఫ్ ఫండ్ సొమ్మును కాజేశారో కూడా తెలుసని, దీనిపై విచారణ జరుగుతోందని, త్వరలోనే అన్నీ బయటకు వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
0 Comments