పశ్చిమాసియాలో పరిణామాలపై 25న అఖిలపక్ష సమావేశం


శ్చిమాసియాలో తలెత్తిన పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం ఈనెల 25న అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. బుధవారం సాయంత్రం 5 గంటలకు ఏర్పాటు చేయనున్న ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షత వహించనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ సైతం హాజరయ్యే అవకాశం ఉంది. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నాలుగో వారానికి చేరుకోవడం, ఆ ప్రభావం భారత్‌లో చమురు, గ్యాస్ పంపిణీపై పడుతుండటంపై పార్లమెంటులో సమగ్ర చర్చ జరగాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో యుద్ధ ప్రభావంతో దేశం ఎదుర్కొంటున్న సవాళ్లపై ప్రధానమంత్రి సోమ, మంగళవారం ఉభయసభల్లోనూ మాట్లాడారు. దీనికి ముందు విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, పెట్రోలియం శాఖ మంత్ర హర్దీప్ పురి సైతం లోక్‌సభ, రాజ్యసభలో ప్రకటనలు చేశారు. ఈ క్రమంలో పార్లమెంటులో చర్చకు మారుగా అఖిలపక్ష సమావేశం ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. పశ్చిమాసియాలో ఘర్షణల ప్రభావం ప్రపంచ దేశాలపై పడిందని ప్రధాని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పాటు ప్రజల జీవితాలపై యుద్ధం ప్రభావం చూపుతోందన్నారు. భారత్ సైతం అసాధారణ సవాళ్లు ఎదుర్కొంటోందని, యుద్ధ ప్రభావం దీర్ఘకాలం కొనసాగే పరిస్థితి కనిపిస్తోందని చెప్పారు. కరోనా సమయంలో ఇలాంటి సవాళ్లనే ఎదుర్కొన్నామని, ఇప్పుడు మళ్లీ అదే తరహా సవాళ్లను దేశ ప్రజలంతా కలిసికట్టుగా ఎదుర్కోవాలని కోరారు. ఉద్రిక్తతలు తగ్గించడం, హోర్ముజ్ జలసంధిని తెరిపించడం ప్రభుత్వం ముందున్న లక్ష్యమని, చర్చలు, దౌత్యం ద్వారా పశ్చిమాసియాలో శాంతి నెలకొనాలని భారత్ కాంక్షిస్తోందని చెప్పారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org