Ad Code

డెల్‌ టెక్నాలజీస్‌లో 11,000 మంది ఉద్యోగుల తొలగింపు ?


డెల్‌ టెక్నాలజీస్‌ భారీ స్థాయిలో ఉద్యోగ కోతలు చేపట్టింది. 2026 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ తన గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌ను సుమారు 11,000 తగ్గించి, మొత్తం సిబ్బందిని 108,000 నుండి 97,000కు తీసుకువచ్చింది. ఈ వివరాలు తాజాగా విడుదల చేసిన వార్షిక 10-K ఫైలింగ్‌లో వెల్లడయ్యాయి. కంపెనీ ఈ తొలగింపులపై బహిరంగ ప్రకటన చేయకపోయినా, ఉద్యోగ విరమణ ఖర్చుల రూపంలో సుమారు 569 మిలియన్ డాలర్లు వెచ్చించినట్లు తెలిపింది. ఇది కంపెనీ అమలు చేస్తున్న "క్రమశిక్షణా వ్యయ నిర్వహణ" వ్యూహంలో భాగమని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ ఖర్చు 693 మిలియన్ డాలర్లు ఉండగా, ఈసారి తగ్గడం గమనార్హం. ఒకేసారి పెద్దఎత్తున ఉద్యోగులను తొలగించడం కాకుండా, దశలవారీగా సిబ్బందిని తగ్గించుకున్నట్లు కంపెనీ ఫైలింగ్ సూచిస్తోంది. ఖర్చులను ఆప్టిమైజ్ చేయడం, కార్యకలాపాలను ఆధునీకరించడం, ముఖ్యంగా కృత్రిమ మేధస్సు, ఎంటర్‌ప్రైజ్ మౌలిక సదుపాయాలపై పెట్టుబడులను పెంచడం లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు కంపెనీ వెల్లడించింది. 2023లో సుమారు 1.33 లక్షల మంది ఉన్న డెల్‌ వర్క్‌ఫోర్స్‌, 2024లో 1.20 లక్షలకు, 2025లో 1.08 లక్షలకు పడిపోయింది. తాజా కోతలతో మూడు సంవత్సరాల్లో దాదాపు 27 శాతం వర్క్‌ఫోర్స్‌ తగ్గిపోయినట్లైంది.

Post a Comment

0 Comments

Close Menu