మహారాష్ట్ర మంత్రి, బీజేపీ నాయకురాలు పంకజా ముండే ఛత్రపతి శంభాజీనగర్ నుండి లాతూర్ వెళ్లడానికి సిద్ధమవుతుండగా ఆమె ప్రయాణించాల్సిన హెలికాప్టర్ లో సాంకేతిక లోపం తలెత్తినట్లు గుర్తించారు. హెలికాప్టర్ గాల్లోకి ఎగరకముందే ఈ లోపాన్ని గుర్తించడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. అయితే, దీనివల్ల ఆమె ముందుగా నిర్ణయించుకున్న బహిరంగ సభల షెడ్యూల్ లో మార్పులు చోటుచేసుకున్నాయి. నేడు ఆమె లాతూర్ లో ప్రచారం చేయాల్సి ఉంది. ఛత్రపతి శంభాజీనగర్ లో హెలికాప్టర్ టేకాఫ్ కు సిద్ధమవుతున్న సమయంలో, పైలట్ హెలికాప్టర్ లోని ఒక సాంకేతిక లోపాన్ని గమనించారు. అప్రమత్తమైన పైలట్ వెంటనే విమానాన్ని నిలిపివేసి, సాంకేతిక బృందానికి సమాచారం అందించారు. ఈ సాంకేతిక సమస్య కారణంగా లాతూర్ లో జరగాల్సిన పంకజా ముండే సభలు ఆలస్యమయ్యాయి. లాతూర్ లో ఆమె కోసం పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వేచి ఉన్న సమయంలో ఈ వార్త తెలియడంతో కాసేపు ఆందోళన నెలకొంది. అయితే, పంకజా ముండే సురక్షితంగా ఉన్నారని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కార్యకర్తలు సంయమనం పాటించాలని ఆమె కోరారు.
0 Comments