ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లోని ఉగ్రవాద శిబిరాలపై పాకిస్తాన్ వైమానిక దళం విరుచుకుపడింది. ఈ మెరుపు దాడుల్లో డజన్ల సంఖ్యలో ప్రాణనష్టం సంభవించినట్లు తెలుస్తోంది. నిఘా వర్గాల సమాచారంతో, అత్యంత కచ్చితత్వంతో ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు పాకిస్తాన్ ప్రకటించగా, తమ పౌరులను లక్ష్యంగా చేసుకున్నారని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి అత్తావుల్లా తరార్ వెల్లడించిన వివరాల ప్రకారం ఆప్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లోని టెహ్రీక్-యే-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ), ఇస్లామిక్ స్టేట్ ఖొరాసాన్ ప్రావిన్స్ (ఐఎస్-కేపీ)కు చెందిన ఏడు ప్రధాన స్థావరాలను పాక్ సైన్యం లక్ష్యంగా చేసుకుంది. రంజాన్ మాసం ప్రారంభమైనప్పటి నుంచి పాకిస్థాన్‌పై మూడు సార్లు ఆత్మాహుతి దాడులు జరగడం, ముఖ్యంగా ఇస్లామాబాద్ మసీదుపై జరిగిన దాడిలో 31 మంది మరణించడంతో పాక్ ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. 2008 నాటి మారియట్ హోటల్ పేలుడు తర్వాత ఇస్లామాబాద్‌లో జరిగిన అత్యంత దారుణమైన దాడి ఇదే కావడం గమనార్హం. ఆప్ఘనిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ఈ దాడులను తీవ్రంగా ఖండించారు. పాక్ వైమానిక దళం నంగర్హర్, పక్తికా ప్రావిన్సుల్లోని నివాస ప్రాంతాలపై బాంబులు వేసిందని.. ఈ ఘటనలో మహిళలు, చిన్నారులతో సహా డజన్ల కొద్దీ పౌరులు మరణించారని ఆయన పేర్కొన్నారు. దీనిపై అంతర్జాతీయ సమాజం స్పందించాలని కోరారు. మరోవైపు పాక్ సైన్యం తన ప్రకటనలో ఘాటుగా స్పందించింది. "తమ భూభాగాన్ని పాకిస్థాన్‌పై దాడులకు వాడుకోనివ్వవద్దని ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా వారు పట్టించుకోలేదు. ఉగ్రవాదులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మా పౌరుల రక్షణ కోసం మేము ఈ ప్రతీకార చర్య చేపట్టాల్సి వచ్చింది" అని పాక్ సైన్యం స్పష్టం చేసింది.
0 Comments