Ad Code

భారతదేశం క్రిటికల్ మినరల్ రంగంలో కీలకంగా మారబోతోంది


క్రిటికల్ మినరల్ రంగంలో భారత దేశం కీలకంగా మారబోతుందని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి  కిషన్ రెడ్డి అన్నారు.  ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఎనర్జీ ట్రాన్సిషన్, గ్రీన్ డెవలప్‌మెంట్, సాంకేతిక అభివృద్ధి వంటి అంశాలకు కీలకమైన ఖనిజాలు అత్యంత కీలకమన్నారు. సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, డిఫెన్స్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, మెడికల్ ఇమేజింగ్, న్యూక్లియర్ ఎనర్జీ వంటి వివిధ రంగాల్లో.. లిథియం, కోబాల్ట్, నికెల్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, కాపర్ వంటి క్రిటికల్ మినరల్స్ చాలా అవసరం. భారత్ మాత్రమే కాదు. మొత్తం ప్రపంచ భవిష్యత్తు ఈ మినరల్స్‌పై ఆధారపడి ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. భారత్‌ తన అవసరాలకు 95% క్రిటికల్ మినరల్స్‌ను దిగుమతి చేసుకుంటుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రిటికల్ మినరల్స్ వాల్యూ చైన్ కొన్ని దేశాల్లోనే కేంద్రీకృతమై ఉందన్నారు కేంద్రమంత్రి. కొన్ని దేశాలు ఉద్దేశపూర్వకంగా వీటిని పూర్తిగా తమ ఆధీనంలో ఉంచుకోవాలని చూస్తున్నాయి. దీంతో క్రిటికల్ మినరల్స్ అనేది ఒక కీలకమైన జియోపొలిటికల్ అంశంగా మారిందన్నారు. ఇది భారతదేశానికి కూడా ఒక సవాలుగా మారింది. అయితే ప్రధానమంత్రి నరేంద్రమోదీ చొరవతో క్రిటికల్ మినరల్స్‌ కొరతను అధిగమిస్తున్నామన్నారు. ప్రపంచ క్రిటికల్ మినరల్ రంగంలో భారతదేశంలో ఓమైనా, ఆకర్షణీయమైన గమ్యస్థానంగా ఎదిగేందుకు ఇదే సరైన సమయం అన్నారు. ప్రధాని మోడీ విధానాలు, సమగ్ర చర్యలకు సరైన బాటలు వేస్తోందన్నారు. ఈ రంగంలో అందరు భాగస్వామ్య పక్షాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్రప్రభుత్వం క్రిటికల్ మినరల్స్ విషయంలో మిషన్ మోడ్‌లో పనులు మొదలుపెట్టింది. నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ అనేది ఈ దిశలో తీసుకున్న కీలకమైన అడుగు అని కేంద్ర మంత్రి తెలిపారు. అన్వేషణ నుండి వెలికితీత, ప్రాసెసింగ్, రిఫైనింగ్, రీసైక్లింగ్, పరిశోధన, విదేశాల్లోని క్రిటికల్ మినరల్ ఆస్తులను దక్కించుకోవడం వరకు మొత్తం సరఫరా గొలుసును బలపరచడమే ప్రస్తుతం భారత్ ముందున్న లక్ష్యమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దీనికితోడు దేశీయంగా క్రిటికల్ మినరల్స్ ఉత్పత్తిని పెంచడంపైనా దృష్టిసారించామన్నారు. 2014 కి ముందు దేశంలో 1,400 ఎక్స్‌ప్లోరేషన్ ప్రాజెక్టులు మాత్రమే ఉండేవి. ఈరోజు ఆ సంఖ్య 4,000 దాటిందన్నారు. దీనికితోడు ఎక్స్‌ప్లోరేషన్ ను మరో అడుగుముందుకు తీసుకెళ్లేందుకు.. 41 నోటిఫైడ్ ప్రైవేట్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీలు 100% నేషనల్ మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ నిధుల ద్వారా ప్రోత్సాహాన్ని అందజేస్తుంది. 200కి పైగా ప్రాజెక్టులు ఆర్థికంగా సహకారాన్ని అందించాం. ఎక్స్‌ప్లోరేషన్ రిస్క్ తగ్గించడానికి అదనపు రాయితీలు కూడా అందిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. డొమెస్టిక్ ప్రాసెసింగ్, రిఫైనింగ్ కెపాసిటీ పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించామని, భారత్ రా మెటీరియల్ ఎగుమతిదారుగా కాకుండా వాల్యూ క్రియేటర్‌గా మారాలనేది మోడీ సర్కార్ ఉద్దేశమన్నారు. అందుకే.. 24 క్రిటికల్ మినరల్స్‌పై ఎగుమతి సుంకం మినహాయింపు ఇచ్చామన్నారు. 2026 - 27 బడ్జెట్‌లో క్యాపిటల్ గూడ్స్‌పై కస్టమ్స్ డ్యూటీ కూడా మినహాయింపు ఇచ్చాం. ఇది కూడా కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలను చేరుకునే దిశలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అంతే కాకుండా ఒడిషా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో రారే ఎర్త్ కారిడార్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించామని కిషన్ రెడ్డి తెలిపారు. దీనికి అవసరమైన రేర్ ఎర్త్ శాశ్వత అయస్కాంతాల కోసం రూ. 7,280 కోట్ల ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం ప్రారంభించామన్నారు. విద్యుత్ వాహనాలు, రెన్యూవబుల్ ఎనర్జీ, రక్షణ రంగాలకు తోడ్పాటు అందించడం లక్ష్యంగా కార్యక్రమ ప్రణాళిక ఉంటుందన్నారు. క్రిటికల్ మినరల్స్ విషయంలో విదేశాలతో ఒప్పందాలు చేసుకోవడంలో చాలా చురుకుగా ముందుకెళ్తున్నామన్నారు. అర్జెంటీనాలో లిథియం గనిని తీసుకున్నాం. త్వరలో అక్కడ పనులు ప్రారంభించబోతున్నాం. కెనడాతో మాట్లాడుతున్నాం. రెండ్రోజుల క్రితం ఫ్రాన్స్ గనుల శాఖ మంత్రితో సమావేశమై కీలకమైన విషయాలు చర్చించానని కేంద్ర మంత్రి వివరించారు.

Post a Comment

0 Comments

Close Menu