మావోయిస్టు పార్టీ టాప్ కమాండర్‌గా భావిస్తున్న దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, అలాగే పొలిట్‌బ్యూరో సభ్యుడు రాజిరెడ్డి సహా 16 మంది మావోయిస్టులు తెలంగాణ ఎస్‌ఐబీ ఎదుట లొంగిపోయారు. తెలంగాణలోని పెద్దపల్లికి చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ, మావోయిస్టు పార్టీ సెక్రటరీగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్లు సమాచారం. నంబాల కేశవరావు మృతి అనంతరం ఆయన పార్టీకి నాయకత్వం వహిస్తున్నారని వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఆయన అధికారికంగా జనరల్ సెక్రటరీనా కాదా అన్న విషయంపై గతంలో చర్చలు సాగినా, ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి ఆయననే ప్రధాన దిక్సూచి అన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు చంద్రన్న గతంలో దేవ్‌జీని సుప్రీం కమాండర్‌గా ఎన్నుకున్నట్లు ప్రకటించగా, మాజీ పొలిట్‌బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ వంటి వారు ఆ విషయంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో భద్రతా బలగాలు ఆపరేషన్ కగార్-2, కర్రె గుట్టలు-2 వంటి ప్రత్యేక ఆపరేషన్లను ప్రారంభించాయి. దేవ్‌జీ, రాజిరెడ్డిని లక్ష్యంగా ఈ ఆపరేషన్లు సాగాయి. మావోయిస్టు పార్టీలో పలువురు అగ్రనేతలు ఎన్‌కౌంటర్లలో మృతి చెందారు. నంబాల కేశవరావు, హిడ్మా, టెక్ శంకర్ తదితరుల మరణం పార్టీకి పెద్ద దెబ్బగా మారింది. మరికొందరు కీలక నేతలు మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న, బర్స దేవా వంటి వారు కూడా సరెండర్ అయ్యారు. ఈ పరిణామాలతో పార్టీ బలహీన స్థితిలోకి వెళ్లింది. ఇలాంటి సమయంలో దేవ్‌జీ వంటి అగ్రనేత లొంగిపోవడం ఉద్యమానికి తీవ్రమైన మానసిక దెబ్బగా భావిస్తున్నారు.
0 Comments