ఫిబ్రవరి 9 నుంచి మెట్రో నెట్‌వర్క్‌లోని అన్ని జోన్లల్లో కూడా ఛార్జీలు అయిదు శాతం మేర పెరుగుతాయని బెంగళూరు మెట్రో రైలు కార్పొరేషన్ లిమిటెడ్ అధికారికంగా ప్రకటించింది. ఛార్జీల నిర్ధారణ కమిటీ (ఎఫ్‌ఎఫ్‌సీ) సిఫార్సుల మేరకు వార్షిక ఛార్జీల సవరణ విధానంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నమ్మ మెట్రో కార్పొరేషన్ తెలిపింది. మెట్రో రైల్వేస్ (ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్) యాక్ట్ 2002 నిబంధనల ప్రకారం ఈ ఛార్జీల సవరణ అమలుకానుంది. బెంగళూరు మెట్రో కోసం ఏర్పాటు చేసిన మొదటి ఎఫ్‌ఎఫ్‌సీ సిఫార్సుల ఆధారంగా దీన్ని చేపట్టారు. భవిష్యత్తులో ఆకస్మిక, భారీ ఛార్జీల పెంపులను నివారించడానికి ఈ విధానాన్ని నమ్మ మెట్రో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం-బీఎంఆర్‌సీఎల్ 96.10 కిలోమీటర్ల మెట్రో నెట్‌వర్క్‌ను 10 వేర్వేరు ఫేర్ జోన్‌లుగా విభజించి నడుపుతోంది. ప్రయాణీకుల సౌలభ్యం కోసం ప్రస్తుతం అమల్లో ఉన్న స్మార్ట్ కార్డ్, ఎన్‌సిఎంసి వినియోగదారుల డిస్కౌంట్లు యథావిధిగా కొనసాగుతాయని బీఎంఆర్‌సీఎల్ వెల్లడించింది. దీనిలో పీక్ అవర్స్‌లో అయిదు శాతం, నాన్-పీక్ అవర్స్‌లో 10 శాతం రాయితీ అందుబాటులో ఉంటోంది. ఆదివారాలు, మూడు జాతీయ సెలవు దినాల్లో కూడా 10 శాతం డిస్కౌంట్ కొనసాగుతుంది. తాజా పెంపు టూరిస్ట్ కార్డులు, గ్రూప్ టిక్కెట్లకు కూడా వర్తిస్తుంది. ఒక రోజు పాస్ కోసం స్మార్ట్ కార్డ్ ద్వారా రూ. 300 నుండి రూ. 313, మొబైల్ క్యూఆర్ ద్వారా 250 నుండి రూ. 263లు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, మూడు రోజుల పాస్ కోసం స్మార్ట్ కార్డ్ రూ. 600 నుండి రూ. 628, మొబైల్ క్యూఆర్ రూ. 550 నుండి రూ. 578కి పెరుగుతుంది. అయిదు రోజుల పాస్ కోసం స్మార్ట్ కార్డ్ రూ. 900 నుండి రూ. 943, మొబైల్ క్యూఆర్ ద్వారా 850 నుండి 893కు పెరుగుతుంది.
0 Comments