Ad Code

కార్ల ధరలను పెంచిన టయోటా కిర్లోస్కర్ మోటార్స్


యోటా కిర్లోస్కర్ మోటార్స్ ఫిబ్రవరి 3 నుంచి కార్ల ధరలను పెంచింది. ఎంట్రీ లెవల్ మోడల్స్ నుంచి లగ్జరీ కార్ల వరకు అన్నింటిపై ధరల భారం పడింది. ముడి సరుకుల ధరలు పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ పేర్కొంది. అన్ని కార్ల ధరలను 1.98 శాతం వరకు పెంచింది. ముఖ్యంగా బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ అయిన గ్లాంజా ధర రూ.15,800 వరకు పెరిగింది. దీంతో ఈ కారు ప్రారంభ ధర ఇప్పుడు రూ.6.46 లక్షల (ఎక్స్-షోరూమ్) కు చేరుకుంది. అలాగే మారుతి ఎర్టిగాకు రీబ్యాజ్డ్ వెర్షన్ అయిన రూమియన్, అర్బన్ క్రూయిజర్ టైజర్ ధరలు రూ.16,400 వరకు ఎగబాకాయి. ఇక మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో దుమ్ము రేపుతున్న హైరైడర్ పై అత్యధికంగా రూ.21,000 భారం పడింది. టయోటాకు బ్రాండ్ ఇమేజ్ తెచ్చిన ఇన్నోవా హైక్రాస్, ఇన్నోవా క్రిస్టా, ఫార్చ్యూనర్ ధరలు కూడా భారీగానే మారాయి. ఇన్నోవా క్రిస్టా డీజిల్ వెర్షన్ ధరలు ఇప్పుడు రూ.18.85 లక్షల నుంచి రూ.25.67 లక్షల మధ్య ఉండగా, హైబ్రిడ్ వెర్షన్ అయిన హైక్రాస్ ధర రూ.32.38 లక్షల వరకు పలుకుతోంది. కొండల మీద కూడా దూసుకుపోయే హైలక్స్, ఫార్చ్యూనర్ కొనాలంటే ఇప్పుడు రూ.34 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు వెచ్చించాల్సి ఉంటుంది. అత్యంత ఖరీదైన ల్యాండ్ క్రూయిజర్ 300 ధర కూడా రూ.2.15 కోట్ల నుంచి రూ.2.24 కోట్ల మధ్య ఊగిసలాడుతోంది. పర్యావరణ హితమైన హైబ్రిడ్ కార్లను కొనేవారికి కూడా టయోటా ఊరటనివ్వలేదు. లగ్జరీ సెడాన్ క్యామ్రీ ధర ఇప్పుడు దాదాపు రూ.47.62 లక్షలకు చేరింది. ఇక సెలబ్రిటీల ఫేవరెట్ అయిన వెల్‌ఫైర్ ధరలు రంగును బట్టి రూ.1.20 కోట్ల నుంచి రూ.1.30 కోట్ల వరకు పెరిగాయి. కంపెనీ తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయంతో ఇప్పటికే బుకింగ్ చేసుకున్న కస్టమర్లపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. 

Post a Comment

0 Comments

Close Menu