Ad Code

చిన్న స్వామి స్టేడియంలో మ్యాచ్ ల నిర్వహణపై నిషేధాన్ని ఎత్తివేసిన కర్నాటక మంత్రివర్గం


బెంగళూరు లోని చిన్న స్వామి స్టేడియంలో మ్యాచ్ ల నిర్వహణపై  నిషేధాన్ని ఎత్తివేస్తూ కర్నాటక మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. గతేడాది తొలిసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ టైటిల్ దక్కించుకున్న తర్వాత చిన్న స్వామి స్టేడియంలో నిర్వహించిన సంబరాలు వివాదాస్పదమయ్యాయి. చిన్న స్వామి స్టేడియంలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో అభిమానులు చనిపోవడంతో కర్నాటక ప్రభుత్వంపై చర్యలు తీసుకోక తప్పని ఒత్తిడి ఎదురైంది. దీంతో చిన్న స్వామి స్టేడియంలో మ్యాచ్ లను కూడా నిర్వహించకుండా నిషేధం విధించింది.  ఆ నిషేధాన్ని ఇప్పుడు ఎత్తివేసింది. ఈసారి ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభోత్సవాలతో పాటు ఆర్సీబీ ఆడే మ్యాచ్ లను కూడా చిన్న స్వామి స్టేడియంలో నిర్వహించుకునేందుకు వీలుగా కర్నాటక కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే ఇప్పుడు కొన్ని భద్రతా ఆంక్షలతో ఈ అనుమతి ఇస్తున్నట్లు కర్నాటక కేబినెట్ ప్రకటన తెలిపింది. ఈ నిర్ణయంతో కర్నాటకలో ఆర్సీబీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. తిరిగి సొంత గ్రౌండ్ చిన్న స్వామిలో ఆర్సీబీ మ్యాచ్ లు చూడలేమన్న ఆందోళన వారిలో తొలగిపోయింది. చిన్న స్వామి స్టేడియంలో ఆర్సీబీ మ్యాచ్ లకు అనుమతించిన కర్నాటక ప్రభుత్వం.. భద్రతపై మాత్రం రాజీపడబోమని ఫ్రాంచైజీకి తేల్చిచెప్పేసింది. ఇక్కడ ఆడే మ్యాచ్‌లకు పటిష్ట మార్గదర్శకాలతోనే అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. తాజా భద్రత, నిర్వహణ ప్రణాళికలను అధికారులు పరిశీలించి ఆమోదించారని వెల్లడించింది. సవరించిన బ్లూప్రింట్ ప్రకారం, పటిష్ట ఎంట్రీ, ఎగ్జిట్ వ్యవస్ధళతో పాటు జనసమూహ నియంత్రణ వ్యూహాలు, భద్రతా సిబ్బంది మోహరింపుల పెంపు వంటివి ఇందులో ఉన్నాయి. అలాగే ప్రత్యేక ఆన్-సైట్ వైద్య, అత్యవసర బృందాలు, కంట్రోల్ రూమ్‌ల మధ్య నిరంతర సమన్వయం కూడా చేపడతారు. ట్రాఫిక్ నిర్వహణతో పాటు, బెంగళూరు పోలీసులు, బీబీఎంపీ, ఏజెన్సీలు సన్నిహిత సమన్వయంతో పనిచేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. 

Post a Comment

0 Comments

Close Menu