Ad Code

పగటిపూట బ్యూటీ పార్లర్ - రాత్రివేళ డ్రగ్స్ దందా !


ఢిల్లీలో పగటిపూట బ్యూటీ పార్లర్ నిర్వహిస్తూ సాధారణ మేకప్ ఆర్టిస్ట్‌గా కనిపించిన ఓ మహిళ, రాత్రివేళ డ్రగ్స్ సరఫరా నెట్‌వర్క్‌ను నడిపే కీలక వ్యక్తిగా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో ఖుష్నుమా అన్సారీ అలియాస్ నేహా అనే మహిళను అరెస్ట్ చేశారు. ఈశాన్య ఢిల్లీలో ఆమె నడిపే పార్లర్ కేవలం ముసుగు మాత్రమేనని విచారణలో వెల్లడైంది. ఆమె లారెన్స్ బిష్ణోయ్, హాషీమ్ బాబా గ్యాంగ్‌లతో సంబంధాలు కలిగి డ్రగ్ సిండికేట్‌ను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. భారీ మొత్తంలో హెరాయిన్ సహా మత్తు పదార్థాలు ఆమె వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, నేహా గత కొన్ని సంవత్సరాలుగా మహ్ఫూజ్ అలియాస్ బాబీ కబూతర్ అనే గ్యాంగ్‌స్టర్‌తో సన్నిహిత సంబంధం కలిగి ఉంది. ఈ బాబీ కబూతర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు ఆయుధాలు సరఫరా చేసే కీలక వ్యక్తిగా గుర్తింపు పొందాడు. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో డ్రగ్స్ పంపిణీ నెట్‌వర్క్‌ను నేహా తన పార్లర్ నుంచే పర్యవేక్షించేదని అధికారులు పేర్కొన్నారు. నేహా అరెస్టుతో ఢిల్లీ అండర్‌వర్ల్డ్‌లో మహిళల పాత్ర పెరుగుతోందన్న అంశం మరోసారి స్పష్టమైంది. గతంలో గ్యాంగ్‌స్టర్ భార్యలు, సోషల్ మీడియా ద్వారా గుర్తింపు పొందిన మహిళా క్రిమినల్స్ కూడా పోలీసులకు చిక్కిన సందర్భాలు ఉన్నాయి. మహిళలు కూడా క్రైమ్ నెట్‌వర్క్‌లలో కీలక పాత్ర పోషిస్తున్నారని అధికారులు చెబుతున్నారు.

Post a Comment

0 Comments

Close Menu