కేరళలోని పిరవం ప్రాంతానికి చెందిన రిటైర్డ్ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ కేకే సజిమోన్, కేరళ క్రిస్మస్-న్యూ ఇయర్ బంపర్ లాటరీలో రూ. 20 కోట్ల భారీ బహుమతి గెలుచుకున్న టికెట్ (నెం. XC 138455) తనదేనని అంటున్నారు. జనవరి 24న వెలువడిన ఈ ఫలితాల్లో తన టికెట్‌కే మొదటి బహుమతి వచ్చిందని, అయితే పొరపాటున ఆ టికెట్ వేరే వారికి చేరిందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసు విభాగం నుంచి రిటైరైన తర్వాత సజిమోన్ ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్నారు. అతనికి చెందిన వాహనంలో ఇటీవల విశాఖపట్నం నుంచి వచ్చిన అయ్యప్ప భక్తులు శబరిమల యాత్ర చేశారు. అయితే వారు తిరిగి వెళుతున్నప్పుడు పొరపాటున తమ నెయ్యి డబ్బాను సజిమోన్ వాహనంలోనే మరిచిపోయారు. కాగా జనవరి 30న ఆ భక్తులు ఈ విషయాన్ని సజిమోన్‌కు తెలియజేయడంతో అతను ఆ నెయ్యి డబ్బాను విశాఖకు కొరియర్ చేశారు. అయితే తన వాహనంలోని నెయ్యి డబ్బా కింద భద్రంగా దాచిన రూ. 20 కోట్ల లాటరీ టికెట్‌ను తాను గమనించకుండా ఆ డబ్బాతో పాటే కొరియర్ పార్శిల్‌లో పంపేశానని సజిమోన్ చెబుతున్నారు. ఫిబ్రవరి 1న తన పొరపాటు గ్రహించి, కొరియర్ ఏజెన్సీని సంప్రదించినప్పటికీ, ఫిబ్రవరి 4 నాటికే ఆ పార్శిల్ విశాఖకు చేరిపోయిందదని తెలిసింది. తన బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు కంజిరపల్లిలో ఈ లాటరీ టికెట్ కొనుగోలు చేశానని, టికెట్ వెనుక తన పేరు, చిరునామా కూడా రాశానని సజిమోన్ పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ఆయన పిరవం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కొరియర్ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. అలాగే కొరియర్ ఆఫీసులోని సిసిటివి ఫుటేజీని పరిశీలించాలని కోరుతూ ఆయన పిరవం ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు.
0 Comments