దేశంలో ఉచిత ఆహారం, విద్యుత్తును అందించడం కొనసాగిస్తే వాస్తవ అభివృద్ధికి ఎలా నిధులు సమకూర్చుకుంటారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాలను అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. త్వరలోనే ఎన్నికల జరగనున్న తమిళనాడులో ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా రాష్ట్రంలో ప్రజలందరికీ ఉచిత విద్యుత్ పథకం అమలుకు డీఎంకే ప్రభుత్వం ఆమోదించింది. లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ సబ్సిడీల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న రాష్ట్రాలు అభివృద్ధికి నిధులు కేటాయించకపోడంపై సర్వోన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. ముఖ్యంగా ఆర్థిక స్థోమత ఉన్నవారికి విచక్షణారహితంగా ఉచిత పథకాలను అందజేయడం వల్ల పని చేయకుండానే ప్రతిఫలం లభించే సంస్కృతి ఏర్పడిందని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఈ పథకాన్ని చివరి నిమిషంలో ఎందుకు ప్రకటించారో వివరించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. ప్రభుత్వ నిర్ణయంతో విద్యుత్ పంపిణీ సంస్థలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని వ్యాఖ్యానించింది. దేశంలో ఎలాంటి సంస్కృతిని తీసుకొస్తున్నామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ''ఉదయం లేవగానే ఉచిత ఆహారంతో మొదలు పెట్టి. తర్వాత ఫ్రీ సైకిల్, కరెంట్.. ఇప్పుడు మనం నేరుగా ప్రజల ఖాతాల్లోకి నగదు బదిలీ చేసే దశకు చేరుకుంటున్నాం...ఒక్కసారి ఊహించుకోండి'' అని అన్నారు. సంక్షేమ వ్యవస్థలో భాగంగా అల్పదాయ వర్గాల వారికి అందజేయడం సమంజసమే.. కానీ, ఉన్నవారు, లేనివారు అనే తేడా లేకుండా పంపిణీ చేస్తే ఎలా'' జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ''విద్యను పొందలేని పిల్లలకు అందించడం ప్రభుత్వం విధి. కానీ ఇప్పటికీ సంపన్నులు ఉచితాలను ముందుగా వారి జేబుల్లో నింపుకుంటారు. రాష్ట్రాలు ఈ విధానపరమైన నిర్ణయాలను పునఃసమీక్షించాల్సిన సమయం ఆసన్నమైంది'' అని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. అంతేకాదు, కనీసం ఒక్క త్రైమాసిక ఆదాయాన్ని అభివృద్ధికి తప్పనిసరిగా వినియోగించాలని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ''కొన్నిసార్లు నిజంగా ఆందోళన చెందుతాం.. మిగులు రాష్ట్రమైనప్పటికీ... మౌలిక సదుపాయాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, కళాశాలల అభివృద్ధికి ఖర్చు చేయడం మీ బాధ్యత కాదా? దీనికి బదులుగా ఎన్నికల సమయంలో మీరు ఉచితాలను పంపిణీ చేస్తూనే ఉంటారు... ప్రభుత్వాల ఇటువంటి విధానాల కారణంగా అభివృద్ధికి ఒక్క పైసా కూడా మిగలదు.. ఇదీ మీది మాత్రమే కాదు అన్ని రాష్ట్రాల సమస్య'' అని తమిళనాడు ప్రభుత్వానికి కోర్టు తెలిపింది. ఉచితాలు భవిష్యత్తు తరాలకు భరించలేని ఆర్థిక భారాలను సృష్టిస్తుందనే ఆందోళనల నేపథ్యంలో ఇది పరిశీలించాల్సిన చాలా ముఖ్యమైన అంశమని ఈ జనవరిలో సీజేఐ వ్యాఖ్యానించారు. ''ఉచిత వైద్యం, విద్య, ప్రజా సంక్షేమ చర్యలు, అది సరే... కానీ సంక్షేమ పథకాలపై ఖర్చు చేయడం కంటే అలాంటి వాటిలో పెద్దగా ఖర్చు చేయకపోవడం పరిశీలించాల్సి అంశమే'' అని అన్నారు.
0 Comments