టెక్ కంపెనీలు ఏఐపై పెడుతున్న పెట్టుబడుల వల్ల 2026 సంవత్సరం టెక్ రంగంలో ఒక చారిత్రాత్మక మైలు రాయిగా నిలిచిపోనున్నది. బ్లూమ్‌బెర్గ్ తాజా నివేదిక ప్రకారం గూగుల్, అమెజాన్, మెటా , మైక్రోసాఫ్ట్ కంపెనీలు ఈ ఏడాది ఏఐ కోసం వెచ్చించబోయే మొత్తం అక్షరాలా $650 బిలియన్లు. ఈ మొత్తం మన దేశ వార్షిక బడ్జెట్ కు దాదాపు సమానంగా ఉండటం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. భారతదేశం 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ ప్రవేశపెట్టబోయే మొత్తం ప్రభుత్వ ఖర్చు (బడ్జెట్) సుమారు $670 బిలియన్లుగా అంచనా. దాదాపు 150 కోట్ల మంది జనాభా ఉన్న మన దేశంలో.. రక్షణ, ఆరోగ్యం, విద్య, మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాలన్నింటికీ కలిపి ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తారు. కానీ, కేవలం నాలుగు టెక్ కంపెనీలు తమ వ్యాపారంలో ఒకే ఒక విభాగం కోసం ఇంత భారీ మొత్తాన్ని వెచ్చిస్తుండటం ఏఐ రేసు ఎంత తీవ్రంగా ఉందో అర్థం పట్టేలా చేస్తోంది.
* అమెజాన్ తన క్లౌడ్ సర్వీస్ ను బలోపేతం చేసేందుకు సుమారు $200 బిలియన్లు వెచ్చించనుంది.
* గూగుల్ ఏఐ మోడల్స్ అభివృద్ధి కోసం $175 బిలియన్ల నుండి $185 బిలియన్ల వరకు పెట్టుబడి పెట్టబోతోంది.
* మెటా & మైక్రోసాఫ్ట్ సంస్థలు ఒక్కొక్కటి $115 బిలియన్ల నుండి $135 బిలియన్ల వరకు ఖర్చు చేయనున్నాయి.
ఈ భారీ పెట్టుబడులన్నీ ప్రధానంగా 'ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్' నిర్మాణం కోసం వినియోగిస్తున్నారు. ఇందులో అత్యాధునిక డేటా సెంటర్లు, శక్తివంతమైన కంప్యూటర్ చిప్స్, అడ్వాన్స్‌డ్ సర్వర్లు, నెట్‌వర్కింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. చాట్‌బాట్లు, ఇమేజ్ జనరేటర్లు, ఎంటర్‌ప్రైజ్ ఏఐ టూల్స్ వంటి ఆధునిక టెక్నాలజీలను నడపాలంటే ఇలాంటి భారీ మౌలిక సదుపాయాలు తప్పనిసరి. ఈ పెట్టుబడులు కేవలం పోటీ కోసం మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఈ కంపెనీలకు ఉన్న పట్టును సూచిస్తున్నాయి. అయితే ఒకవైపు ప్రైవేట్ కంపెనీలు ఏఐ కోసం లక్షల కోట్లు కుమ్మరిస్తుంటే, మరోవైపు అభివృద్ధి చెందుతున్న దేశాలు విద్య, వైద్యం వంటి కనీస అవసరాల కోసం కూడా నిధుల కొరతతో ఇబ్బంది పడటం గమనార్హం. ఏఐ రేసులో ఎవరు గెలుస్తారనే దానికంటే ఈ సాంకేతికత వల్ల సామాన్యులకు ఎంతవరకు మేలు జరుగుతుందనేదే ఇప్పుడు అసలైన ప్రశ్న.
0 Comments