Ad Code

వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య


ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరులో భార్య-ప్రియుడి కలిసి భర్తను హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. చిలువూరుకు చెందిన లోకం శివనాగరాజు ఉల్లిపాయల వ్యాపారం చేస్తుండగా, ఆయనకు లక్ష్మీమాధురితో 2007లో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. విజయవాడలో సినిమా థియేటర్ టికెట్ కౌంటర్‌లో పనిచేసే సమయంలో లక్ష్మీమాధురికి సత్తెనపల్లికి చెందిన గోపితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్త చేస్తున్న ఉల్లిపాయల వ్యాపారం తనకు ఇష్టం లేదని భావించిన లక్ష్మీమాధురి, ఆయనను వ్యాపారం మానిపించి హైదరాబాద్‌కు పంపించింది. ఈ సమయంలో ఆమె ప్రియుడితో సంబంధాన్ని కొనసాగించింది. కొంతకాలానికి హైదరాబాద్‌లో ఉండలేక శివనాగరాజు తిరిగి చిలువూరుకు వచ్చి మళ్లీ వ్యాపారం ప్రారంభించాడు. ఇంటివద్దే ఉండటం వల్ల లక్ష్మీమాధురి -గోపిల మధ్య అక్రమ సంబంధానికి అడ్డుగా మారాడు. దీంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. భర్త అడ్డు తప్పించుకోవాలని భావించిన లక్ష్మీమాధురి ఈ నెల 18న రాత్రి బిర్యానీ వండింది. అందులో నిద్రమాత్రలు కలిపి శివనాగరాజుకు పెట్టింది. అతడు గాఢ నిద్రలోకి వెళ్లాక అర్థరాత్రి సమయంలో ప్రియుడు గోపిని పిలిపించింది. ఇద్దరూ కలిసి శివనాగరాజును ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. తర్వాత తెల్లవారుజామున గుండెనొప్పితో భర్త మృతి చెందినట్లు చుట్టుపక్కల వారికి చెప్పింది. అయితే గతంలో జరిగిన కుటుంబ వివాదాలు, ఆమె అక్రమ సంబంధంపై ఉన్న అనుమానాల నేపథ్యంలో ఇరుగుపొరుగువారు అప్రమత్తమయ్యారు. మృతదేహంపై గాయాలున్నట్లు గుర్తించడంతో నాగరాజు కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టం నివేదికలో ఛాతీ వద్ద ఎముకలు విరిగినట్లు, ఊపిరాడక మరణం జరిగినట్లు తేలింది. ఈ నేపథ్యంలో పోలీసులు లక్ష్మీమాధురిని విచారించగా నేరం అంగీకరించింది. అనంతరం ఆమెతో పాటు ప్రియుడు గోపిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.

Post a Comment

0 Comments

Close Menu