Ad Code

తెలంగాణలో రేషన్ కార్డు లబ్దిదారులకు బియ్యంతో పాటు మరో నాలుగు సరుకులు !


తెలంగాణలో రేషన్ కార్డు లబ్దిదారులకు బియ్యంతో పాటు మరో నాలుగు సరుకులను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో రేషన్‌లో బియ్యంతోపాటు పంచదార, గోధుమలు వంటి నిత్యవసరాలను ఇవ్వనున్నట్లు మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. బహిరంగ మార్కెట్ లో సరుకుల ధరలు ఎక్కువగా ఉండటంతో.. రేషన్‌లో గోధుమలు, పంచదార, జొన్నలు, రాగులు లేదా చింతపండు, కందిపప్పు లాంటివి ఇవ్వటం ద్వారా పేదలకు ప్రయోజనకరంగా ఉంటుందని వివరించారు. ఈ మేరకు ఈ సారి జరిగే మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకొని అధికారికంగా ఆమోద ముద్ర వేయనున్నారు. వానాకాలం సీజన్‌లో 70.82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్య సేకరణతో గత 25 ఏళ్లలో ఎన్నడూ లేని రికార్డు నమోదైందని మంత్రి వెల్లడించారు. మొత్తం ధాన్యం ఉత్పత్తిలో సగానికి పైగా సన్న రకాలే ఉన్నాయని చెప్పారు. సాంబ మసూరి, తెలంగాణ మసూరి వంటి నాణ్యమైన రకాల సాగుకు ప్రభుత్వం మరింత ప్రోత్సాహం ఇస్తందని వెల్లడించారు. రైతులకు మేలు జాతి విత్తనాలు అందించి, సన్న పంట సాగును విస్తరించాలన్నదే లక్ష్యమని మంత్రి తెలిపారు. ధాన్యం ఎక్కువైతే నిల్వ సవాల్ గా మారిందని.. దీంతో, గోదాముల సామర్థ్యాన్ని పెంచేందుకు ఆధునిక సాంకేతికతను తీసుకొస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ ఖరీఫ్‌లో రాష్ట్రవ్యాప్తంగా 14.21 లక్షల మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి. వారి ఖాతాల్లో నేరుగా రూ.17,018 కోట్లను జమ చేసినట్టు తెలిపారు. సన్న బియ్యం పండించిన రైతులకు అదనంగా క్వింటాకు రూ.500 చొప్పున ఇప్పటివరకు రూ.1,425 కోట్ల బోనస్ అందించామని మంత్రి వెల్లడించారు.

Post a Comment

0 Comments

Close Menu