బీహార్‌కు చెందిన 24 ఏళ్ల యువకుడు భార్య, రెండు ఏళ్ల కుమారుడితో కలిసి ఉపాధి నిమిత్తం చెన్నైకి వలస వచ్చాడు. చెన్నై తారామణిలోని సెంట్రల్ పాలిటెక్నిక్ కాలేజీలో సెక్యూరిటీ గార్డుగా చేరిన ఆ యువకుడు, కాలేజీ ప్రాంగణంలోని క్వార్టర్స్‌లో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఆ యువకుడు బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న అతని భార్యపై ఒక గుర్తు తెలియని ముఠా అమానుషంగా దాడి చేసింది. ఆమెపై అత్యాచారం చేసి, అత్యంత క్రూరంగా హత్య చేశారు. భార్య కేకలు విని అక్కడికి చేరుకున్న ఆ యువకుడిపై కూడా ఆ ముఠా దాడి చేసి, అతడిని కొట్టి చంపేసింది. తమ కళ్లెదుటే తల్లిదండ్రులు చనిపోవడంతో ఏడుస్తున్న రెండు ఏళ్ల పసిబిడ్డను కూడా ఆ కిరాతకులు కనికరం లేకుండా హతమార్చారు. హత్య అనంతరం, యువకుడి మృతదేహాన్ని ఒక గోనె సంచిలో కట్టి అడయార్ ఇందిరా నగర్ సమీపంలోని నది ఒడ్డున పడేశారు. భార్య, కొడుకు మృతదేహాలను ఎక్కడ పడేశారో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నిందితుల వాంగ్మూలం ప్రకారం వారు మృతదేహాలను చెత్త కుప్పల్లో పడేసినట్లు చెప్పడంతో, పెరుంగుడి చెత్త యార్డును పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అడయార్ పోలీసులు ఇప్పటికే ఐదుగురు అనుమానితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. పెరుంగుడి చెత్త యార్డు వద్ద మృతదేహాల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
0 Comments