ఢిల్లీలోని రామ్‌లీల మైదాన్‌లో అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కొంతమంది దుండగులు పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో ఐదుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు రామ్‌లీల మైదాన్‌లోని తుర్క్‌మన్ గేట్ వద్ద సయ్యద్ ఫైజ్ ఇలాహీ మసీదు, శ్మశాన వాటిక ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియ చేపట్టారు. దాదాపు 300 మంది అధికారులు రంగంలోకి దిగారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు మంగళవారం రాత్రి తొలగింపు పనులు మొదలయ్యాయి. బుధవారం తెల్లవారుజామున దాదాపు 20 నుంచి 30 మంది దుండగులు అధికారులపై రాళ్ల దాడికి దిగారు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దుండగుల దాడిలో ఐదుగురు పోలీసులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. మసీదుకు సంబంధించిన ఫంక్షన్ హాల్, డిస్పెన్సరీని అధికారులు కూల్చివేశారు. రాళ్ల దాడి సంఘటనపై సీనియర్ పోలీస్ అధికారి నిధిన్ వల్సన్ మాట్లాడుతూ 'రాళ్ల దాడి చేసిన వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. పరిస్థితి ఇప్పుడు నూటికి నూరు శాతం కంట్రోల్‌లో ఉంది. దాదాపు 100 వీడియోల ద్వారా నిందితులను గుర్తించే పనిలో ఉన్నాము. గాయపడ్డ మున్సిపల్ సిబ్బంది, పోలీసుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తాం' అని అన్నారు. కాగా, అక్రమ నిర్మాణాలను తొలగించడానికి అదికారులు 30 బుల్డోజర్లను, 50 డంప్ ట్రక్‌లను ఉపయోగించారు. రాత్రికి రాత్రే పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలను తొలగించారు.
0 Comments