77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. విదేశీ పాలన సంకెళ్ల నుంచి భారతావనిని విముక్తి చేసేందుకు ప్రాణత్యాగం చేసిన వీరులకు ఆమె ఘన నివాళులర్పించారు. మన సైనిక దళాల సన్నద్ధత పట్ల విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య ప్రయాణం, రాజ్యాంగ విలువలు, పౌరుల బాధ్యతలను గుర్తుచేస్తూ, సంపన్నమైన, స్వావలంబన కలిగిన భవిష్యత్ భారతాన్ని నిర్మించేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. భిన్నత్వంలో ఏకత్వం మన బలం అని, సమ్మిళిత వృద్ధి ద్వారానే దేశం ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. మన స్వాతంత్ర్య పోరాటం కేవలం రాజకీయ మార్పు మాత్రమే కాదని, అది దేశ విధిరాతను మార్చిన మహత్తర ఘట్టమని అభివర్ణించారు. రేపటి వేడుకలను స్వదేశంలోనూ, విదేశాల్లోనూ ఉన్న భారతీయులంతా ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఆగస్టు 15, 1947న స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి భారత్ తన భవిష్యత్తును స్వయంగా లిఖించుకోవడం ప్రారంభించిందని రాష్ట్రపతి గుర్తుచేశారు. రాజ్యాంగం అమలులోకి రావడంతోనే భారత్ నిజమైన ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించిందని పేర్కొన్నారు. ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద గణతంత్ర రాజ్యానికి మన రాజ్యాంగమే పునాది అని, ఇందులో పొందుపరిచిన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి అంశాలు మన దేశానికి ప్రాణవాయువులాంటివని చెప్పారు. రాజ్యాంగ నిర్మాతలు అందించిన ఈ విలువల వల్లే జాతీయతా భావం, దేశ సమగ్రత బలంగా వేళ్లూనుకున్నాయని ఆమె వివరించారు. దేశభక్తి గీతం 'వందేమాతరం' ప్రాముఖ్యతను రాష్ట్రపతి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇది మన దేశానికి ఒక లయబద్ధమైన జాతీయ ప్రార్థన అని అభివర్ణించారు. ప్రముఖ తమిళ కవి సుబ్రమణ్య భారతి రాసిన "వందేమాతరం ఎన్బోమ్" గీతం ప్రజల్లో దేశభక్తిని ఎలా రగిలించిందో గుర్తుచేశారు. బంకించంద్ర ఛటర్జీ రాసిన మూల గీతం, అరవిందుల ఆంగ్ల అనువాదం, సుబ్రమణ్య భారతి తమిళ రచనలు ప్రజలను ఏకం చేయడంలో కీలక పాత్ర పోషించాయని కొనియాడారు. భాషలు వేరైనా భావం ఒక్కటేనని, అది మన జాతీయ సమైక్యతకు నిదర్శనమని అన్నారు.
0 Comments