Ad Code

కొత్త ఇంటి కోసం పునాదులు తవ్వుతుండగా అపురూపమైన నిధి లభ్యం !


ర్ణాటకలోని గడగ్ జిల్లా లక్కుండి గ్రామంలో కొత్త ఇంటి కోసం పునాదులు తవ్వుతుండగా అపురూపమైన నిధి దొరికింది. ఒక రాగి పాత్రలో నిండుగా ఉన్న బంగారు ఆభరణాలు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. లక్కుండి గ్రామానికి చెందిన గంగవ్వ బసవరాజ్ రిత్తి తన పాత ఇంటిని పడగొట్టి కొత్త ఇల్లు కట్టాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం కూలీలు పునాదులు తవ్వడం ప్రారంభించారు. గంగవ్వ కుమారుడు 13 ఏళ్ల ప్రజ్వల్ రిత్తి కూడా అక్కడే ఉండి తవ్వకాల్లో సహాయం చేస్తున్నాడు. తవ్వకం సమయంలో భూమిలో ఒక రాగి పాత్ర తగిలింది. ప్రజ్వల్ దానిని బయటకు తీసి తెరిచి చూడగా, అందులో మెరిసిపోతున్న బంగారు ఆభరణాలు కనిపించాయి. వెంటనే ఆ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు, గ్రామ పెద్దలకు తెలియజేశాడు. ఆ పాత్రలో గొలుసులు, ఉంగరాలు, గాజులు, నెక్లెస్‌లు మరియు చెవి రింగులు ఉన్నాయి. మొత్తం 22 బంగారు ఆభరణాలు లభించాయి. వీటి బరువు 470 గ్రాములు. నగలు ఉన్న రాగి పాత్ర బరువు 630 గ్రాములు వుంది. సమాచారం అందుకున్న పోలీసులు మరియు తాసీల్దార్ ఘటనా స్థలానికి చేరుకుని నిధిని స్వాధీనం చేసుకున్నారు. లక్కుండి హెరిటేజ్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్ శరణు గోగేరి మాట్లాడుతూ ఈ ఆభరణాలు ఏ కాలానికి చెందినవో ఇంకా తెలియదు. పాత్రను చూస్తుంటే ఇది చాలా పురాతనమైనదిగా కనిపిస్తోంది. పురావస్తు శాఖ వారు దీనిని పరిశీలించి పూర్తి వివరాలు వెల్లడిస్తారని తెలిపారు. నిధి దొరకగానే దాచుకోకుండా పెద్దలకు, పోలీసులకు సమాచారం అందించినందుకు ప్రజ్వల్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu