అమెరికాలో H-1B వీసా నిబంధనలను ట్రంప్ ప్రభుత్వం కఠినతరం చేసింది. వీసా ఫీజులను కూడా భారీగా పెంచింది. అయినప్పటికీ, H-1B వీసాల డిమాండ్ ఏమాత్రం తగ్గదని మెటావ్యూ ఏఐ సహ వ్యవస్థాపకుడు షారియార్ తాజ్‌బాక్ష్ స్పష్టం చేశారు. అవసరమైతే ఏటా ఒక లక్ష డాలర్లు (సుమారు రూ. 84 లక్షలు) చెల్లించడానికి కూడా తాము సిద్ధమని ఆయన పేర్కొన్నారు. పెరిగిన వీసా ఫీజులు: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విదేశీయుల రాకపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. గతంలో H-1B వీసా ఫీజు 3,000 నుండి 5,000 డాలర్లుగా ఉండేది. దానిని ట్రంప్ ప్రభుత్వం లక్ష డాలర్లకు పెంచింది. దీనివల్ల కంపెనీలు విదేశీ ఉద్యోగులను తీసుకోవడం తగ్గిస్తాయని అంచనా వేశారు. కానీ షారియార్ దీనిపై భిన్నంగా స్పందించారు. "ఫీజు ఎంత పెంచినా H-1B వీసాల సంఖ్య తగ్గదు. ఏడాదికి ఒక లక్ష డాలర్లు కాదు, రోజుకు ఒక లక్ష డాలర్లు అడిగినా సరే కంపెనీలు చెల్లించడానికి సిద్ధంగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ప్రతిభావంతులైన ఉద్యోగుల కొరత ఉంది. ఏఐ వచ్చినా సరే, కోడింగ్ రాయడానికి, కొత్త విషయాలను సృష్టించడానికి మనుషుల అవసరం ఉంటుంది. ఏఐ తనంతట తానుగా అన్నీ చేయలేదు" అని ఆయన చెప్పుకొచ్చారు. అమెరికా జారీ చేసే మొత్తం H-1B వీసాల్లో సుమారు 70% భారతీయులే పొందుతున్నారు. ఫీజుల పెంపు వల్ల భారతీయులకు ఇబ్బందులు ఎదురవుతాయని భావిస్తున్న తరుణంలో, అమెరికన్ కంపెనీల సీఈఓలు ఇలాంటి సానుకూల వ్యాఖ్యలు చేయడం ఊరటనిచ్చే అంశం. మెటావ్యూ ఏఐ వంటి సంస్థలు ప్రతి సంవత్సరం వందలాది మంది భారతీయులను H-1B వీసా ద్వారా అమెరికాకు తీసుకెళ్తున్నాయి.
0 Comments