Ad Code

తిరుమలలో దివ్య ఔషధ వనాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన టీటీడీ !


తిరుమలలో రూ.4.25 కోట్లతో దివ్య ఔషధ వనాన్ని ఏర్పాటు చేయాలని టీటీడీ నిర్ణయించింది. అరుదైన, అంతరించిపోతున్న ఔషధ మొక్కలకు నిలయంగా ఉన్న శేషాచలం అడవులకు జీవనాడిగా దివ్య ఔషధ వనాన్ని ఏర్పాటు చేయాలని టీటీడీ సంకల్పించింది. ఔషధ మొక్కలను సంరక్షిస్తూ, వాటి ప్రత్యేకతల గురించి ప్రజలకు తెలియజేయడం దీని ముఖ్య ఉద్దేశం. తద్వారా పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్య సంరక్షణ లక్ష్యాలకు దివ్య ఔషధ వనం తోడ్పడనుంది. ఈ దివ్య ఔషధ వనంలో దేహ చికిత్స వనం, సుగంధ వనం, పవిత్ర వనం, ప్రసాద వనం, పూజా ద్రవ్య వనం, జీవరాశి వనం, కల్పవృక్ష ధామం, ఔషధ కుండ్, ములికా వనం, రుతు వనం, విశిష్ట వృక్ష వనం, ఔషధ మొక్కలు వంటి 13 రకాల ప్రత్యేక థీమ్ ఆధారిత విభాగాలు ఏర్పాటు చేయనున్నారు. ఇవి భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించడమే కాకుండా, ఔషధ విజ్ఞానం, ప్రకృతిపై అవగాహనను పెంపొందించనున్నాయి. తిరుమలలోని జీఎన్సీ టోల్ గేట్ కు సమీపంలో దిగువ, ఎగువ ఘాట్ రోడ్లకు మధ్యలో ఉన్న 3.90 ఎకరాల స్థలంలో ఈ దివ్య ఔషధ వనం అభివృద్ధి చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. వచ్చే నెలలో పనులు ప్రారంభించి మొక్కలను పెంచి, భక్తుల సందర్శనకు వీలుగా పార్కింగ్, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తిస్థాయిలో ఔషధ వనాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. 4.25 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రూపొందించిన ఈ ప్రాజెక్టుకు టీటీడీ ఆమోదం తెలిపింది.

Post a Comment

0 Comments

Close Menu