Ad Code

తలాక్ తర్వాత కూడా బిడ్డను పోషించాల్సిందే : సుప్రీంకోర్టు


లాక్-ఎ-హసన్ పద్ధతిలో విడాకులు పొందిన ఓ ముస్లిం మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం పిల్లల హక్కుల పరిరక్షణకు అనుకూలంగా కీలక నిర్ణయం తీసుకుంది. విడాకుల తర్వాత బిడ్డ పోషణ బాధ్యత, ఇతర అధికారిక పత్రాల విషయంలో తండ్రి సహకరించడం లేదంటూ సదరు ముస్లిం మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆమై పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం బిడ్డ హక్కుల పరిరక్షణ కోసం తండ్రికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. బిడ్డకు సంబంధించిన పాస్‌పోర్ట్ జారీ, స్కూల్ అడ్మిషన్, బ్యాంక్ అకౌంట్‌కు సంబంధించిన అన్ని పత్రాలపై తండ్రి తప్పనిసరిగా సంతకం చేయాలని కోర్టు ఆదేశించింది. మైనర్ బిడ్డకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ గార్డియన్‌షిప్‌ను తండ్రికి బదులుగా తల్లికి అప్పగించాలని బ్యాంకును సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే బిడ్డ ఆధార్ కార్డు, ఇతర అధికారిక పత్రాలపై తల్లి పేరును గార్డియన్‌గా అప్‌డేట్ చేయాలని కూడా ఆదేశించింది. తండ్రి బిడ్డకు మెయింటెనెన్స్ చెల్లించాలని కోర్టు ఆదేశించింది. మహిళ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. విడాకులు జరగకపోయినా లేదా బిడ్డ తండ్రి వద్ద ఉన్నా కూడా స్కూల్, బట్టలు, పుస్తకాలు, ఆహారం వంటి అవసరాలకు డబ్బులు ఇవ్వాల్సిందేనని అన్నారు. మహిళ తన కోసం ఏమీ అడగడం లేదని, కేవలం బిడ్డ కోసమే పోషణ భత్యం అడుగుతున్నారని తెలిపారు. తండ్రి ఢిల్లీ కోర్టులో న్యాయవాది అయినప్పటికీ, తన సంపాదన చాలా తక్కువ అని కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి "నువ్వు న్యాయవాదివి కదా" అని వ్యాఖ్యానించారు. తండ్రిని సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీకి పంపించాలని, అతడిని ప్యానెల్‌లో చేర్చాలని, ప్రతి నెలా కనీసం రెండు కేసులైనా ఇవ్వాలని, తద్వారా అతనికి కనీసం రూ.10,000 ఆదాయం వస్తుందని, ఆ డబ్బును నేరుగా బిడ్డ పోషణకు పంపాలని ఆదేశించారు. "బిడ్డకు తండ్రి నుంచి మద్దతు పొందే హక్కు ఉంది. బిడ్డకు తండ్రిపై, దేశంపై హక్కు ఉంది" అని సీజేఐ స్పష్టం చేశారు. విడాకుల తర్వాత గత 36 నెలలుగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, "షరియా చట్టంలో కూడా పోషణ భత్యం చెల్లించాల్సిన బాధ్యత లేదా?" అని మహిళ న్యాయవాది ప్రశ్నించారు. ఈ అంశాన్ని ప్రస్తుతం పక్కన పెడతామని చెప్పిన సీజేఐ.. ముస్లిం మహిళల విడాకుల సమయంలో పోషణ భత్యం, హక్కులకు సంబంధించిన పెద్ద సమస్యపై తాము దృష్టి పెడతామని తెలిపారు. దీనికి సంబంధించి అన్ని పక్షాలు లిఖితపూర్వక పత్రాలను దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది.

Post a Comment

0 Comments

Close Menu