తెలంగాణలోని ఆదిలాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించి, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొని ప్రసంగిస్తూ కేసీఆర్ చేసిన పాపం ఊరికే పోదని విమర్శలు చేశారు. కేసీఆర్ కుటుంబంలో కాసుల పంచాయితీ తప్ప, మరొకటి లేదని ఎద్దేవా చేశారు. ప్రజల సొమ్ము తిన్నవారు ఎవరూ బాగుపడే చరిత్ర లేదని హెచ్చరించారు. ఒక పెద్దాయన ఆదిలాబాద్‌కు దెయ్యంలా పట్టారని సెటైర్లు గుప్పించారు. కాళేశ్వరం కడితే కూలేశ్వరం అయిందని, వారింట్లో కాసులు కురిశాయని విమర్శించారు. ఆ ప్రాజెక్టు పేరు మారిందని, ప్లేస్ మారింది, అంచనాలు లక్ష కోట్లకు పెరిగాయని ఆరోపించారు. గత నిరంకుశ ప్రభుత్వాన్ని ప్రజలు సాగనంపారని విమర్శించారు. గత పాలకులు ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా పాలించారని ధ్వజమెత్తారు. విపక్ష నేతలను కలుపుకుని తాము ముందుకు వెళ్తున్నామని చెప్పుకొచ్చారు. కేసీఆర్ సభల్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఎప్పుడైనా మాట్లాడే అవకాశం ఇచ్చారా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. గతంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సచివాలయానికి వెళ్తే గేట్లకు తాళం వేసి అడ్డుకున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుంటోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు ఓటును ఆయుధంగా మార్చి ప్రజాపాలన తీసుకువచ్చారని తెలిపారు. రెండేళ్లలో ఏరోజూ తాను విశ్రాంతి తీసుకోలేదని చెప్పుకొచ్చారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు.. ఆ తర్వాత అభివృద్ధే లక్ష్యమని వ్యాఖ్యానించారు. సంక్షేమం - అభివృద్ధి రెండుకళ్లుగా ముందుకు సాగుతున్నామని వివరించారు. రాజకీయాలకు అతీతంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
0 Comments