ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి రూరల్ మండలం దామినేడు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థకు భూమి కేటాయిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి అంతర్జాతీయ ఖ్యాతిగల పుణ్యక్షేత్రం మాత్రమే కాకుండా, విద్య వైద్య పర్యాటక రంగాలలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. అటువంటి చోట స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుతో మరింత గుర్తింపు తీసుకురావాలని చంద్రబాబు సంకల్పించారు. ఆధునిక మౌలిక సదుపాయాలతో కూడిన స్పోర్ట్స్ సిటీని ఏర్పాటు చేసి జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడలను అందులో నిర్వహించేలా అందుకు తగినట్టుగా నిర్మాణం చేపట్టనున్నారు. దామినేడు గ్రామంలో 28.37 ఎకరాలలో కేటాయించిన భూమిలో క్రికెట్ స్టేడియం, అథ్లెటిక్స్ ట్రాక్ , ఇండోర్ స్టేడియం, హాకీ, ఫుట్ బాల్ మైదానాలు, స్విమ్మింగ్ పూల్ వంటి క్రీడా సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు. క్రీడాకారుల కోసం హాస్టల్స్, కోచింగ్ అకాడమీలు, స్పోర్ట్స్ సైన్స్ సెంటర్లు, జాతీయ, అంతర్జాతీయ క్రీడలు నిర్వహించడానికి కావలసిన అన్ని ఏర్పాట్లను చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ స్పోర్ట్స్ సిటీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యువతను క్రీడాకారులుగా తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతుందని అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులు వెలుగులోకి రావడానికి బలమైన వేదికగా మారుతుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది.
0 Comments