Ad Code

వచ్చే మార్చి నాటికి మూడు లక్షల ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశం పూర్తి !


తెలంగాణ సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మూడు లక్షల ఇందిరమ్మ ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని, త్వరలో లక్ష ఇళ్లు గృహప్రవేశానికి సిద్ధం అవుతాయని అన్నారు. వచ్చే ఏడాది మార్చికి మూడు లక్షల ఇళ్లు గృహప్రవేశం పూర్తి అవుతుందని వివరించారు. వచ్చే ఏప్రిల్‌లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభం అవుతుందని చెప్పుకొచ్చారు. కోర్ అర్బన్ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం కూడా ప్రణాళిక సిద్ధమైందని వివరించారు. గ్రౌండ్ ప్లస్ ఫోర్ బిల్డింగ్ నిర్మించి పేదలకు ఇచ్చే ప్రణాళికలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. త్వరలో అర్బన్ ప్రణాళిక ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఓఆర్ఆర్ కు ఆనుకుని నలువైపులా ఉన్న స్థలాల్లో ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు. ఒక్కో చోట 10వేల ఇళ్లు నిర్మించి నో ప్రాఫిట్ నో లాస్ కింద మధ్యతరగతి ప్రజలకు ఇస్తామని వివరించారు. గ్లోబల్ సమ్మిట్‌లో ప్రణాళికలు ప్రకటిస్తామని పేర్కొన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం హౌసింగ్ శాఖను నిర్వీర్యం చేసిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హౌసింగ్ శాఖను తిరిగి తాము బలోపేతం చేశామని వివరించారు. గతంలో నిర్మించి మధ్యలో వదిలేసిన ఇళ్లకు కూడా ఇందిరమ్మ పథకం వర్తింపజేయడంపై ఆలోచిస్తున్నామని చెప్పుకొచ్చారు. రూరల్‌లో, అర్బన్‌లో ఇళ్ల స్థలం లేని నిరుపేదలకు కూడా త్వరలో శుభవార్త చెబుతామని పేర్కొన్నారు. ఒక విడతలోనే ఇళ్లు ఇచ్చి తాము చేతులు దులుపుకోమని చెప్పుకొచ్చారు. అర్హులైన పేదలందరికీ ఇళ్లు ఇవ్వాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. హిల్ట్‌ పాలసీపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. కేటీఆర్ హిల్ట్ పాలసీపై అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ అధికారంలోకి వస్తే హిల్ట్ పాలసీ రద్దు చేస్తామని అంటున్నారని, నోటికొచ్చినట్లుగా కేటీఆర్ మాట్లాడటం సరికాదని హితవు పలికారు. బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ అని.. వారి హయాంలో ఇష్టం వచ్చినట్లుగా చేశారని ఫైర్ అయ్యారు. తమ ప్రభుత్వం చాలా వినూత్న నిర్ణయాలు తీసుకుంటుందని, కేసీఆర్ హయాంలో లాగా తాము చేయమని స్పష్టం చేశారు.

Post a Comment

0 Comments

Close Menu