Ad Code

రేపు జరిగే రాష్ట్ర వ్యాప్త పల్స్ పోలియోకు ఏర్పాట్లు పూర్తి


ఆంధ్రప్రదేశ్ లో రేపు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జి.వీరపాండియన్ నేడొక ప్రకటనలో వెల్లడించారు. ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కాకినాడ పట్టణ ఆరోగ్య కేంద్రంలో వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. 5 ఏళ్లలోపు పిల్లల్లందరికీ పోలియో చుక్కల్ని తప్పకుండా వేయించాలన్న కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 54,07,663 మంది 5 ఏళ్ల లోపు పిల్లలకు 38,267 బూత్ లలో పోలియో చుక్కలు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం అందజేసిన 98,99,300 డోస్ లను ఇప్పటికే అన్ని జిల్లాలకు పంపించామని తెలిపారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు అన్ని జిల్లాలకు నోడల్ ఆఫీసర్లను నియమించామన్నారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించేందుకు తల్లిదండ్రులు ముందుకొచ్చి భాగస్వాములు కావాలని కోరారు. వైద్య శాఖ అధికారులు, సిబ్బందికి సహకరించాలన్నారు.

Post a Comment

0 Comments

Close Menu