Ad Code

అద్దె అడిగినందుకు యజమానిని చంపిన దంపతులు : పట్టిచ్చిన పని మనిషి


త్తరప్రదేశ్ లోని ఘజియాబాద్‌లో గత నాలుగు నెలలుగా పేరుకుపోయిన అద్దెను అడిగినందుకు ఓ జంట తమ ఇంటి యజమానిని దారుణంగా హత్య చేశారు. ఆమె మృతదేహాన్ని సూట్‌కేసులో పెట్టి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా, పనిమనిషి అప్రమత్తతతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఘజియాబాద్‌లోని రాజ్ నగర్ ఎక్స్టెన్షన్‌లోని 'ఆరా చిమెరా' రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో దీప్శిఖ శర్మ (48) అనే టీచర్ నివసించేవారు. అదే సొసైటీలో ఆమెకు మరో ఫ్లాట్ కూడా ఉంది. అందులో అజయ్ గుప్తా, ఆకృతి గుప్తా అనే దంపతులు అద్దెకు ఉంటున్నారు. అయితే గత నాలుగు నెలలుగా వారు అద్దె చెల్లించకపోవడంతో బుధవారం మధ్యాహ్నం దీప్శిఖ వారిని అడిగేందుకు ఒంటరిగా వారి ఫ్లాట్‌కు వెళ్లారు. అద్దె విషయంలో దీప్సిఖకు, అద్దెకు ఉంటున్న దంపతులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆ దంపతులు ఆగ్రహంతో ఆమె తలపై ప్రెషర్ కుక్కర్‌తో బలంగా కొట్టారు. ఆ తర్వాత ఆమె మెడకు దుపట్టాతో ఉరి బిగించి ప్రాణాలు తీశారు. అనంతరం సాక్ష్యాలను మాయం చేసేందుకు, ఆమె మృతదేహాన్ని ఒక పెద్ద సూట్‌కేస్లో కుక్కారు. దీప్శిఖ ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో ఆమె పనిమనిషి మీనాకు అనుమానం వచ్చింది. మీనా వెంటనే బిల్డింగ్ సీసీటీవీ ఫుటేజీని తనిఖీ చేయగా, దీప్సిఖ అజయ్ గుప్తా ఫ్లాట్‌లోకి వెళ్లడం కనిపించింది కానీ, బయటకు రావడం కనిపించలేదు. అదే సమయంలో నిందితులు ఒక పెద్ద సూట్‌కేసుతో బిల్డింగ్ నుంచి బయటకు వెళ్లేందుకు ఆటో పిలిచారు. అప్పుడే మీనా వారిని అడ్డుకుంది. "దీదీ ఆచూకీ దొరికే వరకు మీరు ఎక్కడికీ వెళ్లడానికి వీల్లేదు" అని ఆమె వారిని నిలదీసింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఫ్లాట్‌ను తనిఖీ చేయగా.. సూట్‌కేస్‌లో దీప్శిఖ మృతదేహం లభ్యమైంది. ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారం చేసే అజయ్ గుప్తా, అతని భార్య ఆకృతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అద్దె బకాయిలు అడిగినందుకే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మీనా సకాలంలో స్పందించకపోయి ఉంటే, నిందితులు మృతదేహాన్ని ఎక్కడో పడేసి తప్పించుకునేవారని పోలీసులు వెల్లడించారు. పనిమనిషి మీనా ధైర్యాన్ని పోలీసులు ప్రశంసించారు. 

Post a Comment

0 Comments

Close Menu