బార్లీ గింజలను ఉడికించడం ద్వారా తయారయ్యే పానీయం పోషకాలతో నిండి ఉంటుంది. ఇది దాహార్తిని తీర్చడమే కాకుండా కొన్ని దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు త్వరగా ఉపశమనం అందిస్తుంది. బార్లీ వాటర్ దాని డిటాక్సిఫైయింగ్ గుణాల వల్ల ప్రసిద్ధి చెందింది. బార్లీ వాటర్ అత్యంత శక్తివంతమైన మూత్రవర్ధకారి గా పనిచేస్తుంది. అంటే ఇది శరీరంలో మూత్రాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల మూత్రపిండాలు శుభ్రపడతాయి. మూత్ర మార్గంలో ఏర్పడే చిన్న చిన్న మూత్రపిండాల రాళ్లను బయటికి పంపడంలో సహాయపడుతుంది. వైద్యులు కూడా మూత్రపిండాల సమస్యలు లేదా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు ఉన్నవారికి దీనిని తరచుగా సిఫార్సు చేస్తారు. బార్లీలో పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తుంది, పేగు కదలికలను మెరుగుపరుస్తుంది, తద్వారా మలబద్ధకం సమస్యను త్వరగా నివారిస్తుంది. బార్లీలో ముఖ్యంగా ‘బీటా-గ్లూకాన్స్’ అనే కరిగే పీచు పదార్థం ఉంటుంది. ఈ పీచు పదార్థం ఆహారం జీర్ణమయ్యే వేగాన్ని తగ్గిస్తుంది, తద్వారా భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా నియంత్రిస్తుంది. దీనివల్ల డయాబెటిస్ ఉన్నవారికి లేదా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో లేనివారికి బార్లీ వాటర్ అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. బార్లీ వాటర్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది, అనవసరమైన విషపదార్థాలు తొలగిపోతాయి.
0 Comments