శ్రీశైలంలో అన్యమత బోధనలకు సంబంధించిన కరపత్రాలను, పుస్తకాలను పంచటం నిషేధం ఉందని ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఇలాంటి కార్యకలాపాలు నేరమని, చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. శ్రీశైలం క్షేత్ర పరిధిలో అన్యమత ప్రార్థనలు, ప్రచారాలు నిషేధమని స్పష్టం చేశారు. భక్తులందరూ ఈ నిబంధనలను పాటించాలని, ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శ్రీశైలం దేవస్థానం అనుమతి లేకుండా వీడియోలు తీయడం, డ్రోన్లు ఎగురవేయడకూడదు. సోషల్ మీడియాలో వ్యక్తిగత వీడియోలు, రీల్స్ ప్రచారం చేయడం కూడా నిషేధించారు. ఇది భక్తుల ప్రశాంతతకు భంగం కలగకుండా, ఆలయ పవిత్రతను కాపాడటానికి ఉద్దేశించబడింది. దేవస్థానం ప్రాంగణంలో అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా కఠిన చర్యలు తీసుకోనున్నారు. ధూమపానం, మద్యపానం సేవించడం, జూదం ఆడటం, మాంసాహారాలు తినడం వంటివి చట్టరీత్యా నేరమని అధికారులు హెచ్చరించారు. ఈ నియమాలను ఉల్లంఘించిన వారిపై దేవాదాయ ధర్మాదాయ నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. శ్రీశైలం ఆలయానికి వచ్చే భక్తులందరూ ఈ నిబంధనలను తప్పక పాటించాలని, దేవస్థానం అధికారులకు సహకరించాలని ఈవో శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. భక్తుల సహకారంతోనే ఆలయ నిర్వహణ సక్రమంగా జరుగుతుందన్నారు. నాలుగైదు రోజుల క్రితం ఓ యువతి శ్రీశైలంలో రీల్స్ చేయడం కలకలం రేపింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే యువతి ఆ వీడియోపై స్పందించారు. తాను పద్దతిగానే రీల్ చేశానని, ఒకవేళ తప్పు అనుకుంటే క్షమాపణలు చెబుతున్నానన్నారు. కొంతమంది తన వీడియోను ట్రోల్ చేస్తున్నారని, ఇష్టం వచ్చినట్లు కామెంట్లు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆలయ ఈవో స్పందించారు.. భక్తులు నిబంధనలు పాటించాలని సూచించారు. ఎవరైనా హద్దు మీరితే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. శ్రీశైలం వెళ్లే భక్తులు ఈ విషయాలను గమనించి సహకరించాలని ఆలయ ఈవో శ్రీనివాసరావు కోరారు.
0 Comments