ఢిల్లీకి సమీపంలోని ఫరీదాబాద్‌లో లిఫ్ట్ ఇస్తామని నమ్మించి ఒక యువతిని కారులోకి ఎక్కించుకున్న ఇద్దరు దుండగులు, కదిలే కారులోనే రెండు గంటల పాటు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు ప్రతిఘటించడంతో ఆమెపై దాడి చేసి, తల పగలగొట్టి అర్థరాత్రి సమయంలో రోడ్డుపై పడేసి పరారయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితురాలు తన తల్లితో గొడవపడి, తన స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో మెట్రో చౌక్ వద్ద ఆటో కోసం వేచి చూస్తోంది. ఆ సమయంలో ఓ కారులో వచ్చిన ఇద్దరు యువకులు ఆమెకు లిఫ్ట్ ఇస్తామని నమ్మించి కారులోకి ఎక్కించుకున్నారు. నిందితులు కారును ఫరీదాబాద్ నుండి గురుగ్రామ్ రోడ్డు వైపు తీసుకెళ్లారు. సుమారు రెండు గంటల పాటు కారును రోడ్డుపై తిప్పుతూనే ఉన్నారు. ఒకడు కారు నడుపుతుండగా, మరొకడు యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. యువతి గట్టిగా ఎదిరించడంతో ఆమెను విపరీతంగా కొట్టారు. ఆ దాడిలో ఆమె తలకు తీవ్ర గాయమైంది. అనంతరం బాధితురాలిని కదిలే కారులో నుండి కిందకు తోసేసి నిందితులు పారిపోయారు. ఈ దారుణంపై బాధితురాలు తన సోదరికి సమాచారం అందించగా ఆమె వెంటనే పోలీసులను ఆశ్రయించింది. తీవ్రంగా గాయపడిన యువతిని సివిల్ ఆస్పత్రికి తరలించగా ఆమె తలకు 12 కుట్లు పడ్డాయి. ప్రస్తుతం ఆమె ఫరీదాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా గాలింపు చేపట్టారు. ఈ ఘాతుకానికి పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరూ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారని, ప్రస్తుతం ఫరీదాబాద్‌లోనే నివసిస్తున్నారని పోలీసులు గుర్తించారు.
0 Comments