ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీపీసీఎల్ భారీ రిఫైనరీ ప్రాజెక్టు ఏర్పాటు చేయబోతోంది. ఈ మేరకు శంకుస్థాపనకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీని ఆహ్వానించారు. దేశంలోనే అతిపెద్ద సమీకృత ఇంధన ప్రాజెక్టును రూ.96,862 కోట్ల పెట్టుబడితో బీపీసీఎల్ నిర్మిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం 6 వేల ఎకరాలు కేటాయించి, ప్రోత్సాహకాలు కూడా ప్రకటించింది. ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడానికి కేంద్రం సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రమంత్రిని కోరారు. అలాగే ఏపీలో సహజ వాయువు, ఎల్‌ఎన్‌జీ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలకు సహాయం చేయాలని చంద్రబాబు కోరారు. ఎల్‌ఎన్‌జీ టెర్మినళ్లను మరింత అభివృద్ధి చేయాలని.. ఏపీ అభివృద్ధిలో గెయిల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐఓసీఎల్, పెట్రోనెట్ వంటి చమురు కంపెనీలు భాగస్వాములయ్యేలా చూడాలన్నారు. విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌ను కోరారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రాజెక్టులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసిన చంద్రబాబు, ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించిన సవరించిన డీపీఆర్‌లను సమర్పించి, వాటి ప్రాధాన్యతను వివరించారు. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టుల నిర్మాణం త్వరగా చేపట్టాలని కోరారు. ఈ నగరాలు జనాభా, ఆర్థికంగా వేగంగా విస్తరిస్తున్నాయని, కాబట్టి అక్కడి ప్రజలకు ఆధునిక రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ రెండు మెట్రో ప్రాజెక్టులు విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం చేపట్టాలన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక సహాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహించారు. పూర్వోదయ, సాస్కీ, పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుపై ప్రధానంగా దృష్టి సారించారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, వ్యవసాయానికి నీటిపారుదల వ్యవస్థలను మెరుగుపరచడం, మౌలిక సదుపాయాల కల్పన, పరిశ్రమల విస్తరణ, ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటు, విద్య, వైద్య రంగాలలో సౌకర్యాలు కల్పించడం వంటి అభివృద్ధి పనులకు పూర్వోదయ పథకం కింద పెద్దఎత్తున నిధులు అవసరమని చంద్రబాబు వివరించారు. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు గణనీయమైన నిధులు కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఆస్తులను అభివృద్ధి చేయడానికి అవసరమైన పనులను చేపట్టడానికి, మూలధన వ్యయం కోసం ప్రత్యేకంగా ఇచ్చే సహాయం కింద నిధులను త్వరగా విడుదల చేయాలని చంద్రబాబు కోరారు. ప్రస్తుతం రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోందని.. ఈ నిధులు రహదారుల నిర్మాణం, ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటు, సాగునీటి ప్రాజెక్టుల పనులు, ఇళ్ల నిర్మాణం, వైద్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు చాలా అవసరం అన్నారు. అందువల్ల స్కీమ్ (సాస్కీ) కింద ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.10,054 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
0 Comments