Ad Code

స్పేస్ ఎక్స్ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు !


స్పేస్ ఎక్స్ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.2.25 లక్షల కోట్లకు పైగా నిధులు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది నిజమైతే సౌదీ ఆరాంకో రికార్డును అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీవోలలో ఒకటిగా నిలుస్తుంది. ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటే ఒక ప్రైవేట్ కంపెనీ తొలిసారిగా తమ షేర్లను సామాన్య ప్రజలకు విక్రయించడం ద్వారా పబ్లిక్ హోల్డింగ్ కంపెనీగా మారడం. ఈ ప్రక్రియ ద్వారా కంపెనీలు భారీ మొత్తంలో నిధులను సేకరించి, తమ వ్యాపారాలను విస్తరించడానికి, అప్పులు తీర్చడానికి లేదా బ్రాండ్ విలువ, విశ్వసనీయతను పెంచుకోవడానికి ఉపయోగిస్తాయి. ఇండియాలో ఇప్పటివరకు అత్యధిక నిధులు సమీకరించిన ఐపీవోగా హ్యుందాయ్ మోటార్ ఇండియా (రూ.27 వేల కోట్లకుపైగా) అగ్రస్థానంలో ఉంది. గతంలో ఎల్ఐసీ కూడా అతిపెద్ద ఐపీఓ గా నిలిచింది. మీషో, గ్రో, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వంటి కంపెనీలు ప్రస్తుతం మార్కెట్లో సందడి చేస్తున్నాయి. వచ్చే ఏడాది రిలయన్స్ జియో, జెప్టో, ఫోన్‌పే వంటి సంస్థలు కూడా ఐపీవోలకు సన్నాహాలు చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు అతిపెద్ద ఐపీవోగా సౌదీ ఆరాంకో ఉంది. ఆరాంకో 25 బిలియన్ డాలర్లకు పైగా నిధులను సమీకరించింది. అయితే ఇప్పుడు ఎలన్ మస్క్‌కు చెందిన ప్రైవేట్ రాకెట్, శాటిలైట్ తయారీ సంస్థ స్పేస్ ఎక్స్ ఈ రికార్డును బద్ధలు కొట్టేందుకు సిద్ధమవుతోంది. స్పేస్ ఎక్స్ ఐపీవో ద్వారా 25 బిలియన్ డాలర్లకు పైగా అంటే భారత కరెన్సీలో రూ.2.25 లక్షల కోట్లకు పైగా సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. స్పేస్ ఎక్స్ కంపెనీ ప్రస్తుతం ఇన్‌సైడర్ షేర్ సేల్ (అంతర్గత వాటా విక్రయం) ప్రక్రియను చేపడుతోంది. ఈ ప్రక్రియ ద్వారా SpaceX విలువను ఏకంగా 800 బిలియన్ డాలర్లు (సుమారు రూ.72 లక్షల కోట్లు)గా అంచనా వేస్తున్నారు. దీంతో ఇది చాట్‌జీపీటీ పేరెంట్ కంపెనీ ఓపెన్ ఏఐ రికార్డును దాటి, ప్రపంచంలోనే అత్యంత విలువైన ప్రైవేట్ కంపెనీగా నిలుస్తోంది. స్పేస్ ఎక్స్ ఇప్పటికే అర్హులైన వాటాదారుల నుంచి మొత్తం 2.56 బిలియన్ డాలర్ల (రూ.23 వేల కోట్లకుపైగా) విలువైన షేర్ల కొనుగోలు ప్రక్రియను ప్రారంభించింది.ఇక్కడ ఒక్కో షేరుకు 421 డాలర్లు (సుమారు రూ.38 వేలు) చెల్లించడానికి ఆఫర్ ఇచ్చింది. స్పేస్ ఎక్స్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్  బ్రెట్ జాన్సెన్ వాటాదారులకు రాసిన లేఖలో ఈ ఐపీఓ వివరాలు వెల్లడయ్యాయి. ఐపీవో ద్వారా సమీకరించే నిధులను ప్రధానంగా ఈ లక్ష్యాల కోసం వినియోగించనున్నారు. స్టార్‌షిప్ రాకెట్ అభివృద్ధి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.వచ్చే ఏడాదిలోనే స్పేస్ ఎక్స్ పబ్లిక్ ఇష్యూకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.  

Post a Comment

0 Comments

Close Menu