Ad Code

ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసు : సింగిల్‌ బెంచ్‌ తీర్పును కొట్టేసిన కలకత్తా హైకోర్టు


శ్చిమ బెంగాల్‌లో ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో సింగిల్‌ బెంచ్ ఇచ్చిన తీర్పును కలకత్తా హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ కొట్టేసింది. ఈ కేసుతో ముడిపడి ఉన్న 32 వేల ప్రైమరీ టీచర్ల నియామకాలు రద్దుచేస్తూ  తొమ్మిదేళ్లుగా సర్వీసులో ఉన్న వారిని ఇప్పుడు తొలగిస్తే వారి కుటుంబాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని హైకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. సింగిల్‌ బెంచ్‌ రద్దు చేసిన ఆ 32 వేల మంది ప్రైమరీ టీచర్ల నియామకాలు చెల్లుతాయని పేర్కొంది. 32 వేల ప్రైమరీ టీచర్ల నియామకాల విషయంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను స్వాగతిస్తున్నట్లు బెంగాల్ ఎడ్యుకేషన్‌ మినిస్టర్‌ బ్రత్య బసు పేర్కొన్నారు. ఆ 32 వేల మంది ప్రైమరీ టీచర్ల ఉద్యోగాలు పూర్తిగా సురక్షితంగా ఉన్నాయని పేర్కొంటూ టీచర్లకు, ప్రాథమిక విద్యామండలికి శుభాకాంక్షలు తెలిపారు. కాగా 2014 ఉపాధ్యాయ నియామకాల తర్వాత నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ కోర్టులో కేసులు వేశారు. ఈ కేసు విచారణ జరిపిన జస్టిస్ గంగోపాధ్యాయ నేతృత్వంలోని సింగిల్‌ బెంచ్‌ 2023లో 32 వేల మంది ఉపాధ్యాయుల నియామకాలను రద్దుచేసింది. ఆ స్థానాలకు మూడు నెలల్లోపు కొత్త నియామక ప్రక్రియను నిర్వహించాలని బెంగాల్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. కేసును విచారించిన జస్టిస్ సుబ్రతా, జస్టిస్ సుప్రతిమ్ భట్టాచార్యలతో కూడిన హైకోర్టు డివిజన్ బెంచ్.. సింగిల్ బెంచ్ ఉత్తర్వుపై స్టే విధించింది. కొత్త నియామక ప్రక్రియను పూర్తి చేయడానికి రాష్ట్రానికి ఆరు నెలల అనుమతి ఇచ్చింది. స్టేకు వ్యతిరేకంగా ప్రతివాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దాంతో సుప్రీంకోర్టు కేసును తుది విచారణ కోసం హైకోర్టుకు తిరిగి పంపింది. ఈ క్రమంలో తాజాగా కేసు విచారణ జరిపిన హైకోర్టు ఆ 32 వేల మంది టీచర్ల నియామకాలు చెల్లుతాయని తీర్పునిచ్చింది. వచ్చే ఏడాది జరగనున్న పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వెలువడిన ఈ తీర్పు.. విద్యా రంగంలో అవినీతి కుంభకోణాలపై విమర్శలను ఎదుర్కొంటున్న అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు కొంతమేర ఉపశమనం కలిగించిందని చెప్పవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu