బిగ్ బాస్ తెలుగు సీజన్-9 గ్రాండ్ ఫినాలే అట్టహాసంగా ముగిసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో కళ్యాణ్ పడాల విజేతగా నిలిచి ట్రోఫీని కైవసం చేసుకున్నారు. కేవలం టైటిల్ మాత్రమే కాకుండా, కళ్యాణ్ భారీ స్థాయిలో నగదు బహుమతిని కూడా సొంతం చేసుకున్నాడు. విజేతగా ప్రకటించిన వెంటనే ఆయనకు రూ. 35 లక్షల ప్రైజ్ మనీని నిర్వాహకులు అందజేశారు. హౌస్‌లో తనదైన ఆటతీరుతో, నిలకడైన ప్రదర్శనతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న కళ్యాణ్, చివరకు విజేతగా నిలిచి అందరి ప్రశంసలు అందుకున్నారు. అయితే, కళ్యాణ్ సంపాదన కేవలం ఆ రూ. 35 లక్షలకే పరిమితం కాలేదు. 15 వారాల పాటు హౌస్‌లో ఉన్నందుకు గాను, వారానికి రూ. 70 వేల చొప్పున సుమారు రూ. 10.50 లక్షల రెమ్యునరేషన్‌ను ఆయన అందుకున్నారు. దీనికి అదనంగా ప్రముఖ టైల్స్ సంస్థ ‘రాఫ్ టైల్స్’ వారు ఆయనకు మరో రూ. 5 లక్షల గిఫ్ట్ మనీని ప్రకటించారు. మొత్తం మీద నగదు రూపంలోనే కళ్యాణ్ రూ. 50 లక్షల మార్కును దాటేశారు. నగదుతో పాటు మెరిసే ‘మారుతీ సుజుకీ విక్టోరిస్’ కారును కూడా బహుమతిగా గెలుచుకుని ఈ సీజన్లో అత్యధిక ప్రయోజనం పొందిన కంటెస్టెంట్‌గా నిలిచారు. టైటిల్ రేసులో చివరి వరకు నిలిచిన తనూజకు వారానికి రూ. 2.50 లక్షల చొప్పున రెమ్యునరేషన్ అగ్రిమెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ఆమె 15 వారాల పాటు హౌస్‌లో కొనసాగినందుకు గాను మొత్తం రూ. 37,50,000 రెమ్యునరేషన్‌గా అందుకున్నారు. ఇది విజేతకు వచ్చిన ప్రైజ్ మనీ కంటే కూడా ఎక్కువ కావడం గమనార్హం.
0 Comments