2027 జూన్ 26 నుంచి జులై 7 వరకు గోదావరి పుష్కరాల జరగనున్నాయి. అనేక చర్చల తరువాత పండితుల సూచనల మేరకు ముహూర్తాన్ని ఖరారు చేసారు. కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే కేంద్రం నిధులను మంజూరు చేసింది. రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనుల నిర్వహణ కోసం కమిటీ ప్రకటించింది. ఈసారి గోదావరి పుష్కరాలకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. దాదాపు 8 కోట్ల మంది భక్తుల వస్తారన్న అంచనాతోపాటు, ప్రత్యేక రోజుల్లో గరిష్ఠంగా 75,000 మంది వరకూ వస్తారని భావిస్తున్నారు. ఇప్పటికే హాజరయ్యే భక్తుల అంచనాతోపాటు వివిధ సౌకర్యాల గురించి చర్చలు జరిపారు. రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో గోదావరి ప్రవహిస్తునందున ఈ ప్రాంతాలలో పుష్కర పనులు వేగవంతమయ్యేలా ప్రభుత్వం చూస్తుంది. తాజాగా దీనికి సంబంధించి పలు శాఖలు సమీక్ష నిర్వహించారు. పుష్కరాలకు వచ్చే భక్తుల భద్రతకు ప్రాధాన్య ఇస్తూ రద్దీ నియంత్రణ పైన ముందస్తుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఘాట్‌లో 50 మీటర్లకు ఒక కంపార్ట్‌మెంట్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు ఇందులోనే 10 సామాజిక మరుగుదొడ్లు, రెండు దుస్తులు మార్చే గదులు, 6 వాటర్ ఏటీఎంలు, అందుబాటులోకి తీసుకొస్తారు. ప్రతి భక్తుడు ఘాట్‌లోకి వెళ్లి పుణ్యస్నానం చేసి 15 నిమిషాల్లో బయటకొస్తారని అంచనా వేశారు. ప్రతి కంపార్ట్‌మెంట్ నుంచి ఒక రోజు (18 గంటలు)లో 44,928 మంది పుణ్యస్నానం చేస్తారని అంచనా వేస్తున్నారు. గోదావరికి ఇరు వైపులా 7.06 కిలోమీటర్ల మేర 97 ఘాట్‌లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా తూర్పువైపు 4.93 కిలోమీటర్ల పరిధిలో 45 ఘాట్‌లను అధికారులు సిద్ధం చేస్తారు. దేవాదాయ శాఖ కూడా ఇటీవల సమీక్షను ఏర్పాటు చేసింది. దీంట్లో ముఖ్యంగా ఏయే తేదీల్లో పుష్కరాలు నిర్వహించాలనే దానిపై చర్చించారు. ఈ సమావేశంలో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు జిల్లాలకు చెందిన ఆగమ, వైదిక పండితులు, తితిదే ఆస్థాన సిద్ధాంతితో కలిపి మొత్తం 16 మంది పాల్గొని పుష్కరాల తేదీలపై ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. పుష్కరాలను 2027 జూన్ 26 నుంచి జులై 7 వరకు నిర్వహించాలని ఆగమ, వైదిక పండితులు సమీక్షలో సూచించారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఈ నివేదికను పరిశీలించి ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకొని నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంది.
0 Comments