ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు- మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ప్రైవేట్ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 15 మందికి పైగా ప్రయాణికులు దుర్మరణం పాలైనట్లు సమాచారం. పలువురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. వారందరూ చిత్తూరు జిల్లాకు చెందిన స్థానికులుగా గుర్తించారు. చిత్తూరు జిల్లాకు చెందిన కొందరు యాత్రికులు ప్రైవేట్ బస్సు (నంబర్ ఏపీ 39 యూఎం 6543) లో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల సందర్శన కోసం బయలుదేరారు. గురువారం రాత్రి భద్రాచలం ఆలయ దర్శనానంతరం అన్నవరానికి బయలుదేరారు. చింతూరు- మారేడుమిల్లి మీదుగా అన్నవరానికి చేరుకోవాల్సి ఉండగా.. ఘాట్ రోడ్డులో ప్రమాదానికి గురైంది. మలుపులో అదుపు తప్పింది. చూస్తుండగానే 50 అడుగుల లోతు ఉన్న లోయలో పడింది. ప్రమాద సమయంలో బస్సులో 35 మందికి పైగా ఉన్నట్లు సమాచారం. బస్సు పల్టీలు కొడుతూ లోయలో పడింది. మొత్తం నుజ్జునుజ్జు అయింది. యాత్రీకులు నలిగిపోయారు. వారిలో 15 మంది దుర్మరణం పాలైనట్లు ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. కొందరు కిటికీల గుండా బయటపడ్డారు.
0 Comments