విజయవాడలోని చిట్టినగర్ ప్రాంతంలో మద్యం కోసం రూ.10 ఇవ్వలేదన్న కోపంతో ఓ యువకుడు మరొక వ్యక్తిని కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానిక భీమన బాపయ్యవీధి కొండ ప్రాంతంలో తెన్నేరు పాండు జ్యోతి కుమారుడు 19 ఏళ్ల దుర్గాప్రసాద్ ఎలక్ట్రికల్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం రోజున అన్నయ్య సిగరెట్ తాగుతుండగా దుర్గాప్రసాద్ అతడిని మందలించాడు. ఈ విషయంపై కుటుంబంలో వాగ్వాదం జరగడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన దుర్గాప్రసాద్ ఇంటి నుంచి బయటకు వెళ్లి చిట్టినగర్‌లోని ఓ బార్‌లో మద్యం సేవించాడు. మరోసారి మద్యం తాగడానికి దుర్గాప్రసాద్‌కు రూ.10 అవసరమైంది. ఈ క్రమంలో చిట్టినగర్‌కు చెందిన 48 ఏళ్ల పలకా తాతాజీని డబ్బు అడిగాడు. అయితే తాతాజీ డబ్బు ఇవ్వడానికి నిరాకరించడమే కాకుండా, దుర్గాప్రసాద్ చెంపపై కొట్టాడు. దీంతో వెంటనే వేరొకరి వద్ద నుంచి డబ్బు తీసుకుని మళ్లీ మద్యం సేవించాడు. ఆపై ఇంటికి వెళ్లి కత్తి తీసుకుని అర్ధరాత్రి సమయంలో చిట్టినగర్ సొరంగ మార్గంలోని షాపు వరండాలో నిద్రిస్తున్న తాతాజీ వద్దకు వెళ్లాడు. నిద్రలో ఉన్న తాతాజీ ఛాతీలో కత్తితో పొడిచి హత్య చేశాడు. సంఘటన జరిగిన వెంటనే అక్కడి నుంచి నిందితుడు పరారయ్యాడు. కేఎల్‌రావు నగర్‌కు చెందిన పలకా తాతాజీ మద్యానికి బానిసగా ఉన్నాడు. తాపీ పనులు చేస్తూ జీవనం సాగించేవాడని కుటుంబ పరిస్థితుల కారణంగా ఆయన భార్య మంగళగిరిలో ఉంటుండగా, కొడుకులు కాకినాడ, విశాఖపట్నంలో ఉద్యోగాలు చేస్తున్నారు. తాతాజీ ఎక్కువగా చిట్టినగర్ సొరంగ మార్గంలోని షాపు వరండాల్లోనే నిద్రించేవాడని స్థానికులు తెలిపారు. హత్య సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ మేరకు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించగా నిందితుడు టేనర్‌పేట అడ్డరోడ్డు నుంచి లంబాడీపేట వైపు వెళ్లినట్లు గుర్తించారు. పోలీసులు గాలింపు చేపట్టిన సమయంలో, దుర్గాప్రసాద్ తల్లి జ్యోతి స్వయంగా తన కుమారుడిని పోలీసులకు అప్పగించింది. అయితే పది రూపాయల వంటి చిన్న కారణంతో జరిగిన ఈ దారుణ హత్య చిట్టినగర్ ప్రాంతంలో తీవ్ర భయాందోళనకు దారి తీసింది.
0 Comments