Ad Code

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రారంభం


తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. ఇవి ఈ నెల 25వ తేదీ వరకు జరుగనున్నాయి. 18న పెద్దశేషవాహనం, హంసవాహనం, 19న ముత్యపు పందిరి, సింహవాహనం, 20న కల్పవృక్ష వాహనం, హనుమంత వాహనం, 21న పల్లకీ ఉత్సవం, గజవాహనం, 22న సర్వభూపాల వాహనం, స్వర్ణ రథోత్సవం, గరుడవాహన సేవలను నిర్వహిస్తారు. 23 సూర్యప్రభ, చంద్రప్రభ వాహనం, 24న రథోత్సవం, అశ్వ వాహనం, 25న పంచమీతీర్థం ధ్వజావరోహణ కార్యక్రమాలు ఉంటాయి. ఈ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. ఆలయానికి వచ్చిన ఆయనను టీటీడీ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీ వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవో హరీంధ్రనాథ్, ఆలయ అర్చకులు, అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేదాశీర్వచనాలు పలికారు. తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆనం రామనారాయణ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా టీటీడీ ఆధీనంలో ఉన్న అన్ని ఆలయాల్లో అన్నప్రసాదాలు పంపిణీకి చర్యలు చేపట్టామని అన్నారు. దీనికి అవసరమైన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించామని చెప్పారు. ఒంటిమిట్ట సహా అన్ని ఆలయాలను సందర్శించే ప్రతి భక్తుడికీ అన్నప్రసాదం అందేలా చేస్తామని పేర్కొన్నారు. ఆలయాలను సందర్శించే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని, దీనికి తగ్గట్టుగానే ఏర్పాట్లు , ఇతర చర్యలు తీసుకున్నట్లు వివరించారు. తిరుచానూరు బ్రహ్మోత్సవాల్లో పంచమి తీర్థం రోజున దాదాపు 50,000 మందికి పైగా భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. అంతకుముందు- కార్తీక బ్రహ్మోత్సవాలకు సోమవారం ఉదయం శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు. తెల్లవారు జామున అమ్మవారికి సుప్రభాత సేవ, సహస్ర నామార్చన, నిత్య అర్చన జరిపారు. 6:30 గంటలకు నాలుగుమాడ వీధుల్లో తిరుచ్చి ఉత్సవం జరిపి, ధ్వజ స్థంభ తిరుమంజనం నిర్వహించారు. ఉదయం 9:15 నిమిషాలకు బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ గజపటాన్ని ఆరోహణం చేశారు. అనంతరం టీటీడీ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్.. శుక్రవారపు తోటలో ఉద్యాన విభాగం ఏర్పాటు చేసిన పుష్పప్రదర్శన, శిల్ప కళాశాల ఏర్పాటు చేసిన శిల్పకళా, ఆయుర్వేద ప్రదర్శనను ప్రారంభించారు.

Post a Comment

0 Comments

Close Menu