Ad Code

ఉమ్మి వేశాడని విచక్షణారహితంగా దాడి : సోషల్ మీడియాలో వీడియో వైరల్


ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా వినుకొండలో సాధారణమైన విషయంపై ప్రారంభమైన వాగ్వాదం ఘర్షణగా మారి చివరకు రక్తపాతం సృష్టించింది. ఇంటి ముందు ఉమ్మి వేశాడని కొట్టడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. బాధితుడు ప్రస్తుతం చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. ఈ ఘటన ఏపీ వ్యాప్తంగా సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే వినుకొండలోని ఓబయ్య కాలనీలో నివసిస్తున్న రాంబాబు అనే యువకుడు సోమవారం రాత్రి ఓ ఇంటి వద్ద ఉన్నప్పుడు ఉమ్మివేశాడు. అయితే ఈ సంఘటనను గమనించిన మరియబాబు అనే వ్యక్తి "నన్ను చూసి ఉమ్మివేస్తావా?" అంటూ రాంబాబుతో వాగ్వాదానికి దిగాడు. మాట మాట పెరిగి ఇద్దరి మధ్య ఘర్షణ చెలరేగింది. అయితే ఆ సమయంలోనే మరియబాబు స్నేహితులు కూడా అక్కడికి చేరుకొని రాంబాబుపై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలోనే రాంబాబును రోడ్డుమధ్యలో నిలబెట్టి కర్రలు, చేతులతో దారుణంగా కొట్టారు. వారిని కొంతమంది మహిళలు అడ్డుకునేందుకు ప్రయత్నించినా, దుండగులు పట్టించుకోకుండా విచక్షణారహితంగా దాడి కొనసాగించారు. స్థానికులు ఆ ఘటనను వీడియో తీశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాంబాబు తీవ్ర గాయాలతో నేలపై పడిపోవడంతో స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతని పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దాడికి పాల్పడిన మరియబాబు సహా పలువురిని గుర్తించి అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. చిన్న విషయంలోనే ఇంత పెద్ద హింసాత్మక ఘటన చోటుచేసుకోవడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Post a Comment

0 Comments

Close Menu